తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపు పై అధికార బీఆరెస్స్ ధీమా వ్య్యక్తం చేస్తుండగా… కర్ణాటక ఫలితాల అనంతరం మరింత ఊపుమీదున్న కాంగ్రెస్ మరింత ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా కేద్రంలో కాంగ్రెస్ కూటమికి బలం పెరిగిందనే కామెంట్లు వినిపిస్తోన్న తరుణంలో అది తెలంగాణ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందని ఆశిస్తోంది. ఈ సమయంలో తాజాగా ఒక సర్వే.. సంచలన ఫలితాలు వెల్లడించింది.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీల కాన్ ఫిడెన్స్ లెవెల్ పెరుగుతున్నట్లు కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… హ్యాట్రిక్ సాధిస్తామని, ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతామని అధికార బీఆరెస్స్ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో దేశం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తుందని, బీజేపీ డివైడ్ అండ్ రూల్ పాలనపై ప్రజలు విసుగుచెంది ఉన్నారని, అందుకు తాజాగా వెలువడిన కర్ణాటక ఫలితాలే ఉదాహరణ అని కాంగ్రెస్ భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాల అనంతరం దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్ల నడుమ… తెలంగాణాలో సత్తా చాటాలనేది బీజేపీ ఆరాట పడుతోంది.
ఈ సమయంలో.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందనే సర్వే రిపోర్ట్ ను టైమ్స్ నౌ వెల్లడించింది. ఇప్పుడు ఈ సర్వే ఫలితం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫలితాల ప్రకారం తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీఆరెస్స్ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ కు 3-4 సీట్లు, బీజేపీకి 2-3 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని సర్వేలో తేల్చింది. ఇక ఓట్ల విషయానికొస్తే… అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం మంది ప్రజల మద్దతు ఉందని.. ఎన్డీఏకు 24.3 శాతం, ‘ఇండియా’ కూటమికి 29.9 శాతం, ఇతరులకు 7.4 శాతం మేర ఓట్లు వస్తాయని వెల్లడించింది. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ సర్వే తన ఫలితాలు వెల్లడించింది.
ఈ సర్వే ఫలితాల ప్రకారం అధికార బీఆరెస్స్ తొలి స్థానంలో నిలవగా.. ఇండియా కూటమి తరువాతి స్థానంలో ఉంది. అవును… తెలంగాణలో ఎన్డీఏ కంటే కాంగ్రెస్ మెరుగైన స్థానంలో కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో.. ఈ నెలలోనే అభ్యర్ధుల ఎంపికను ఫైనల్ చేసే దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయని తెలుస్తోంది!