గోడమీద పిల్లులకు బాండ్ తో చెక్!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కొత్త ఉత్సాహంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్.. గోపి (గోడమీద పిల్లులు) లకు చెక్ పెట్టేందుకు సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా… పార్టీలో టిక్కెట్ కావాలనుకునేవారు ముందుగా ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి.

అవును తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండు దఫాల్లోనూ జంపింగ్ లు పెద్ద నష్టాన్నే కలిగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం.. అనంతరం ఆర్థిక, పదవుల ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న బీఆరెస్స్ లో చేరిపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో… ఇలాంటి ఆలోచనా విధానం ఉన్నవారికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇందులో భాగంగా… ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం పార్టీ మారను.. మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థీ బాండ్ పేపర్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఈ విధానాన్ని అమలుచేయాలని భావిస్తోంది.

తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ జరిగిన రెండు ఎన్నికల్లోనూ జంపింగ్ లు కాంగ్రెస్ పార్టీకి పొడిచిన వెన్నుపోట్లు… ఆ పార్టీ బలహీనతలో కీలక భూమిక పోషించాయి. 2014లో గెలిచి 23 మంది, 2018 లో 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అనంతరం బీఆరెస్స్ లో చేరిపోయారు. ఇది ఎంత అనైతికమైన పని అయినప్పటికీ… నిస్సిగ్గుగా దాన్ని సమర్ధించుకున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారు.

దీంతో.. మరోసారి ఆ ఛాన్స్ తీఉకోవడానికి టి.కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని ఘంటాపథంగా చెబుతుంది. పైగా గెలుపు అనివార్యం అయిన రాబోయే ఎన్నికల్లో… ఒక్క సీటు కూడా కీలకంగా మారే పరిస్థితి రావొచ్చు. దీంతో… ప్రవీ ఒక్కరితోనూ బాండ్ పేపర్ పై సంతకాలు పెట్టించుకోవాలని టి.కాంగ్రెస్ ఫిక్సయ్యింది.

మరి జంపింగ్ లకు చెక్ పెట్టడంకోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న ఈ కొత్త విధానం ఆ పార్టీకి ఎన్నికల అనంతరం ఎంత వరకూ ఉపయోగపడుతుందనేది వేచి చూడాలి!