Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆరోపించారు. కేరళలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం దక్షిణాది ప్రజలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అవసరమైతే తానే స్వయంగా ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తానని స్పష్టం చేశారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, కానీ కేంద్రం వాటిని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ విమర్శించారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి మరింత అన్యాయం జరుగుతుందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కుటుంబ నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించడంతో జనాభా తక్కువగా ఉంది. దీని ప్రభావంగా ఈ ప్రాంతాలకు అదనపు ఎంపీ సీట్లు రాకపోగా, కొన్నింటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
దీన్ని నివారించేందుకు ప్రధాన మంత్రి మోదీకి తాను ప్రత్యేకంగా లేఖ రాశానని, దక్షిణాది రాష్ట్రాల్లోని స్థానాలకు 50% అదనపు స్థానాలను కల్పించాలని సూచించానని రేవంత్ వివరించారు. బీమారు రాష్ట్రాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవ్వచ్చని, దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రతి వ్యవస్థను కేంద్రం నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
కేంద్రం తీరుతో రాష్ట్రాలకు కలిగే నష్టం గురించి మేధావులు, ప్రజలు ఆలోచించాలని రేవంత్ సూచించారు. రాష్ట్రాల హక్కులను కాపాడే దిశగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే మరింత స్పష్టతనిచ్చే చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.