కేసిఆర్ ఆ నిర్ణయం… కొందరు టిఆర్ఎస్ లీడర్లకు టెన్షన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ షాకింగ్ డిషిషన్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం టిఆర్ఎస్ పార్టీలోని కొందరు లీడర్లను కలవరపెడుతున్నది. ఇంతకూ కేసిఆర్ అంతగా ఏ నిర్ణయం తీసుకున్నారు. టెన్షన్ పడుుతన్న ఆ కొందరు టిఆర్ఎస్ లీడర్లు ఎవరు? చదవండి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినప్పటి నుంచి కొందరు టిఆర్ఎస్ లీడర్లకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఘనవిజయం సాధించామని పైకి ఘనంగా చెప్పుకుంటున్నా… లోలోన మాత్రం కొందరు నాయకులు తీవ్ర ఉత్కంఠతో కాలం గడుపుతున్నారు. దానికి కారణమేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది కదా? అదేనండీ కేసిఆర్ మంత్రి వర్గంలోకి ఎవలెవల్ని తీసుకుంటారు? అన్న ఉత్కంఠ టిఆర్ఎస్ లో కొందరు నేతలను నిద్రపట్టకుండా చేస్తున్నది.

ఫలితాలు వెలువడిన వెంటనే కేసిఆర్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న మహమూద్ అలీ హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇద్దరు మాత్రమే కేబినెట్ లో చేరారు. మరో 16 బెర్తులు నింపాల్సి ఉంది. ఈ బెర్తుల కోసం ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్లు తమ సీనియార్టీని చూపించి ప్రయత్నాల్లో నిమగ్నమైతే… జూనియర్లు తమకున్న గొప్ప విషయాలను చెప్పుకుంటూ తమకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని విన్నపాలు చేస్తున్నారు.

కొందరు నేతలు కేసిఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతుండగా మరికొందరు నేతలు యువరాజు కేటిఆర్ ను ప్రసన్నం చేసుకుని మంత్రివర్గంలో బెర్త్ కొట్టేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశావహులంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లేలా కేసిఆర్ నిర్ణయం జరిగిపోయింది. అదేమంటే? వారం రోజులపాటు సిఎం కేసిఆర్ దేశ పర్యటనకు కుటుంబసమేతంగా వెళ్లాలనని నిర్ణయించుకున్నారు. ఈనెల 23వ తేదీన ఆయన ప్రత్యేక విమానంలో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. దీన్నిబట్టి చూస్తే కేసిఆర్ ఈనెలాఖరు వరకు హైదరాబాాద్ తిరిగొచ్చే అవకాశాలు లేవు.

అయితే కేసిఆర్ హైదరాబాద్ తిరిగొచ్చే వరకు మంత్రివర్గ విస్తరణ అంశం మీద ఎలాంటి ముందడుగు పడే పరిస్థితి లేదంటున్నారు. కేసిఆర్ మదిలో ఏముందో? కేటిఆర్ మదిలో ఏముందో? ఎవరికి బెర్త్ దక్కుతుందో? ఎవరికి దక్కదో అన్న ఉత్కంఠ ఆశావహులైన నేతల్లో ఉంది. తొందరగా తేలిపోతే ఈ టెన్షన్ తప్పేది కదా అని కొందరు నేతలు తమ సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో కేసిఆర్ అనుకున్నవారికి బెర్త్ దక్కుతుందా? లేదంటే కేటిఆర్ ముద్ర ఉంటుందా అన్నది తేలలేదు. దీంతో ఆశావహులు మరో వారం రోజులపాటు ఈ టెన్షన్ ను తట్టుకోక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు.

మాజీ మంత్రులు మళ్లీ చాన్స్ వస్తుందా లేదా అని ఆశగా ఎదురుచూస్తుండగా సీనియర్లు సయితం ఆశతో ఉన్నారు. కొందరు జూనియర్లు తమకు చాన్స్ దక్కవచ్చని ఆశతో ఉన్నారు. మరి కేసిఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడుటుందో అని వారు తమకున్న సోర్స్ ల ద్వారా ఆరా తీస్తున్నారు. 

ఇదీ కేసిఆర్ పర్యటన షెడ్యూల్…

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు.

ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు. సాయంత్రం 6గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు. ఆ రోజు సీఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు.

అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్తారు. సాయంత్రం 4గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు. 25వ తేదీ నుండి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తో సమావేశం అవుతారు.

బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోనూ సమావేశం అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.