తెలంగాణ ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో… వరుస మేనిఫెస్టోలు తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే బీఆరెస్స్ మేనిఫెస్టో ప్రకటించగా… కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో… బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా తాజాగా మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ప్రకటించిన తెలంగాణ బీఎస్పీ… తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇందులో భాగంగా… “పథకాల కొరకు ఎదురుచూసే బాధ లేకుండ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం. అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం” అంటూ ట్వీట్ చేశారు.
బీఎస్పీ మేనిఫెస్టోలోని హైలైట్స్:
“కాన్షీ” యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.. అందులో ప్రత్యేకంగా మహిళలకు 5 లక్షల కొలువులు.. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు!
“బహుజన” రైతుబీమా: ప్రతీ పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడంతోపాటు రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ అందించడం. ఇదే సమయంలో ధరణి పోర్టర్ ను రద్దు చేయడం.
“దొడ్డి కొమురయ్య” భూమి హక్కు: భూమిలేని ప్రతిపేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తూ, మహిళల పేరిట పట్టా ఇవ్వడం.
“చాకలి ఐలమ్మ” మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు ఇవ్వడంతోపాటు మహిళలకు స్మార్ట్ ఫోన్, ఉచిత డ్రైవింగ్ శిక్షణ. అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ.
“భీం” రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం.. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
“పూలే” విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ప్రతీ మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య. డేటా ఏఐ, కోడింగ్ లో శిక్షణ.
“బ్లూ” జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీతో పాటు రోజూ కూలీ రూ.350 పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం, జీవిత బీమా.
“నూరేళ్ల” ఆరోగ్య ధీమా: ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య భీమా.. ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార ఆరోగ్య బడ్జెట్!
వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు.. గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు!
“షేక్ బందగి” గృహ భరోసా: ఇళ్లు లేని వారికి 550 ఇంటి స్థలం కేటాయింపు.. ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయం.. ఇంటి పునర్మిణానికి రూ.1.50 లక్షల సాయం!
దీంతో… అత్యంత వ్యూహాత్మకంగా, అత్యంత ప్రణాళికా బద్ధంగా ఎవరూ ఊహించని విధంగా ఈ మేనిఫెస్టో విడుదలయ్యిందనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. హెచ్చరిక లేని తుఫానులా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన ఈ మేనిఫెస్టో ఎన్నికల్లో ఓటర్లను ఏమేరకు ప్రభావితం చేయబోతోందనేది వేచి చూడాలి.
Bahujan Bharosa, the road map for inclusive and futuristic Telangana.
తెలంగాణ ప్రజలే ఈ మేనిఫెస్టో నిర్మాతలు. ఈ క్రెడిట్ వాళ్లకే ఇస్తున్నాం. Please scan the QR Code to dive deeper into how we are going to liberate and build a new and futuristic Telangana. #BSP4Future pic.twitter.com/kKzQToxYgt— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 17, 2023