వారాహికి ఏమయ్యింది.? తెలంగాణలో ఎందుకు తిరగలేదు.?

వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ తెలంగాణలోనే జరిగింది.! కానీ, ఆ వాహనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముచ్చటపడి ప్రత్యేకంగా చేయించుకున్న వాహనం అది.

జనసేన పార్టీ తరఫున టిక్కెట్ ఆశించిన ఓ ప్రముఖుడు ఈ వాహనాన్ని తమ అధినేత కోసం చేయించారు. ఖర్చు కూడా గట్టిగానే అయ్యింది. ఓ లారీకి రాజకీయ ప్రచార వాహనం తరహాలో హంగులు సమకూర్చారు. పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యాలున్నాయ్. ప్రత్యేకంగా టైర్లు, ప్రత్యేకంగా ఆడియో సాధనాలు.. ఇందులో వున్నాయ్.

లైటింగ్ కూడా.! సెక్యూరిటీ సంగతి సరే సరి.! అత్యంత కట్టుదిట్టంగా ‘వారాహి’ వాహనాన్ని డిజైన్ చేశారు, ఇదే వాహనం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రాజకీయ యాత్రలు కూడా చేశారు.

మరి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వారాహి వాహనం కనిపించకపోవడానికి కారణమేంటి.? వారాహి లేకుండానే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మమ అనిపించేశారు.? ఈ విషయమై జనసేన తెలంగాణ శ్రేణుల్లో బోల్డన్ని ప్రశ్నలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి అధికార పార్టీని విమర్శించినట్లు, తెలంగాణలో ఎక్కడా గులాబీ పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శించిన దాఖలాల్లేవు. జనసేన పోటీ చేస్తోందంటే, పోటీ చేస్తోందంతే. బీజేపీనే ఎక్కువ బాధ్యత తీసుకుంది. బీజేపీ కోసం అలాగే, జనసేన అభ్యర్థుల కోసం అక్కడక్కడా జనసేనాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ బీజేపీనే, ప్రత్యేక శ్రద్ధ పెట్టిందనుకోండి.. అది వేరే సంగతి. ‘జనసేనాని వారాహి వాహనంలో రోడ్ షో చేయబోతున్నారు..’ అంటూ జనసైనికులు అత్యుత్సాహంతో ప్రచారం చేసుకోవడం మినహా, ఆ వారాహి వాహనాన్నయితే తెలంగాణ రోడ్లపై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిప్పేంత సాహసం పవన్ కళ్యాణ్ చేయలేకపోయారు.