తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంచోడెవరు.? ముంచేదెవరు.?

సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తోందా.? రాజకీయాలకు సంబంధించి అయితే, సోషల్ మీడియా హవా అంతా ఇంతా కాదు. ఆ సోషల్ మీడియా ప్రచారం, ఓట్లను రాల్చుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

కానీ, రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రోల్ చేయడానికీ, మానసిక స్థైర్యం దెబ్బ తీయడానికీ సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. రాజకీయాలనే కాదు, వివిధ రంగాలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా చేసే పనులు ఇవే.!

ప్రచారం, వివాదం.. ఇదే సోషల్ మీడియా పని.! నిజానికి, సోషల్ మీడియా ఉద్దేశ్యం వేరు.! నడుస్తున్న వ్యవహారాలు వేరు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నాయి. లక్షలు కాదు, కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి సోషల్ మీడియా మీద రాజకీయ పార్టీలు.

కాంగ్రెస్ ఇప్పటిదాకా పైచేయిగా వుంటూ వచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. తాజాగా, బీఆర్ఎస్ హవా కనిపిస్తోంది. బీజేపీ కూడా తక్కువేం కాదు.! గులాబీ పార్టీ అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వదులుతున్న యాడ్స్ చూస్తోంటే, ముక్కున వేలేసుకోవాల్సిందే.

పెయిడ్ ఆర్టిస్టుల నటన, ‘నిజంగానే జీవించేస్తున్నారు’ అనేలా వుంటోంది. ‘మంచోడు.. ముంచేటోడు..’ అనే కాన్సెప్ట్‌తో బీఆర్ఎస్ వదులుతున్న యాడ్స్, ఇతర రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దాంతో, కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రెసివ్ క్యాంపెయిన్‌కి దిగుతోంది. ఇవన్నీ ఓట్లు రాల్చే వ్యవహారాలేనా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.!