Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో అటు పార్టీ పనులు, ఇటు తన శాఖలతో పాటు సకల శాఖల పరిశీలన పనులు చూస్తున్నారానే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కేంద్రంలో ఏవియేషన్ మినిస్టర్ చేయాల్సిన పనులు కూడా తానే చేయడం వల్లో ఏమో కానీ.. తన విద్యాశాఖ పనులు వెనుకబడిపోతున్నాయనే విషయం గ్రహించలేకపోతున్నారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణ తాజాగా వైరల్ అవుతున్న విషయం!
ఏపీలో విద్యావ్యవస్థ వైసీపీ హయాంలో న భూతో న భవిష్యతీ అన్న స్థాయిలో మార్పులకు నోచుకుందని చెబుతోన్న వేళ.. ఆ మార్పులు అక్కడే ఆగిపోయాయనే చర్చా జరుగుతుందనే దానిలో వాస్తవం లేదా?
తాజాగా వైరల్ అవుతున్న అనకాపల్లిలోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దురదృష్ట పరిస్థితి విద్యాశాఖ మంత్రి చినబాబు దృష్టికి రాలేదా?
ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఒకటే గది ఉండటం ఒకెత్తు అయితే.. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులు సుమారు ఏడాదిన్నరగా ఆగిపోవడాన్ని ఎలా చూడాలి?
ఇలాంటి బిల్డింగులను చూపించి.. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నారా? అందుకు ఈ స్కూలు స్టార్టింగ్ ముడిసరుకా?
ఏపీలో ప్రభుత్వ ఆలోచనలు అంతా ప్రధానంగా పీపీపీపై ఉన్నాయని.. విద్య, రోడ్లు, వైద్యం మొదలైనవాటిని పీపీపీల రూపంలో ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా అన్నట్లుగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా.. అనకాపల్లిలోని ఓ గ్రామంలో బడి పిల్లలు గుడిలో కూర్చుని చదువుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ క్లాసులు 1 నుంచి 5 వరకూ ఉన్నప్పటికీ.. ఆ బడికి గది మాత్రం ఒక్కటే ఉంది. అది కాస్తా శిధిలావస్థకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది పిల్లలకు బడి గదిలోనే పాఠాలు చెబుతుండగా.. మిగిలిన పిల్లలని రామాలయంలో పాఠాలు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... 3, 4 తరగతుల పిల్లలు బడిలో కూర్చుని చదువుకుంటుంటే.. 1,2 తరగతులతో పాటు ఐదో తరగతి పిల్లలు గుడి అరుగుమీద కూర్చుని చదువుకుంటున్నారు! అంటే… స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1, 2 గుడి అరుగుమీద చదివితే తప్ప 3 తరగతికి వెళ్లి బడి ముఖం చూడలేని పరిస్థితి అన్నమాట! దీంతో.. వాతావరణంతో సంబంధం లేకుండా ఆ పిల్లలు గుడి అరుగుమీద కూర్చునే చదువుకుంటున్నారు.
వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “నాడు – నేడు” పథకం ద్వారా సుమారు రూ.43 లక్షలతో రెండు గదుల స్కూలు బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే భవనం స్లాబ్ స్థాయికి చేరిన తర్వాత ఎందుకనో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సుమారు గత ఏడాదిన్నరగా అడుగులు ముందుకు పడటం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి గ్రామస్తుల అనుమతితో గుడిలోనే బడిని నడిపిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన స్కూలు ప్రధానోపాధ్యాయురాలు… ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నారు. నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ ని పూర్తి చేస్తే.. మరింత మంది పిల్లలు జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు… సదుపాయాలు సరిగా లేక చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను దూరంగా ఉన్నపటికీ ప్రైవేటు స్కూల్స్ కి పంపుతున్నారని మరికొందరు చెబుతున్నారు!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… లోకేష్ ఇలాంటి “ప్రాథమిక” సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు ప్రజానికం! ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్లే.. ప్రజలు ప్రైవేటు స్కూల్స్ వైపు వెళ్తున్నారని చెబుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం అదే కోరుకుంటే.. ఈ పాఠశాలను ఇలానే వదిలేయొచ్చని చెబుతున్నారు.

