తైవాన్ ఈశాన్య తీరప్రాంతాన్ని శనివారం అర్ధరాత్రి శక్తివంతమైన భూకంపం ఒక్కసారిగా వణికించింది. యిలాన్ నగరానికి సమీపంలో, సముద్రంలో సుమారు 32 కిలోమీటర్ల దూరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. భూగర్భంలో సుమారు 73 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం తీవ్రతకు రాజధాని తైపీలో ఉన్న ఎత్తయిన భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు, కొన్ని చోట్ల భవనాలకు పాక్షిక నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం నష్టం ఎంత జరిగిందన్న విషయంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు.
ఈ వారంలో తైవాన్‌ను తాకిన రెండో భారీ భూకంపం ఇదే కావడం గమనార్హం. గత బుధవారం 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయపెట్టగా, తాజాగా వచ్చిన ఈ ప్రకంపనలు ఆ భయాన్ని మరింత పెంచాయి. అయితే ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది. భూకంపం సమయంలో భవనాలు ఊగిపోతుండగా ప్రజలు అరుపులు, పరుగులతో భయంతో బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తైపీలోని అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తైవాన్ భౌగోళికంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలకు గురవుతోంది. గతంలో 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 1999లో వచ్చిన 7.3 తీవ్రత భూకంపం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసి 2,000 మందికి పైగా మృతిచెందారు. తాజా భూకంపం నేపథ్యంలో ప్రజలు మరోసారి ఆ భయానక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
