(మల్యాల పళ్లంరాజు)
రజనీకాంత్.. ఒక పేరు కాదు. ఓ బ్రాండ్, తమిళనాట ప్రజలంతా తలైవర్.. గా ఆరాధించే మహా నటుడు సూపర్ స్టార్ రజనీ కాంత్. దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల హీరో గా నిలిచాడు. అభిమానుల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో … అభిమానుల కూటమి రజనీ మక్కళ్ మండ్రంతో పాటు లక్షలాది మంది అభిమానుల కోరిక మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని నిర్ణయించారు. అందుకు అభిమానులను కూడా మానసికంగా సన్నద్ధం చేశారు రజనీ. 2017 డిసెంబర్ 12న తన పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానుల సమక్షంలో అతిత్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు ఖాయమన్న సంకేతాలిచ్చారు. 2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీ పై అధికారికంగా ప్రకటన ఉంటుందని సూచనప్రాయంగా ప్రకటించారు కూడా.
ఏడాది గడిచింది.. ఈ ఏడాదిలో రజనీకాంత్ నటించిన దాదాపు మూడు చిత్రాలు విడుదలయ్యాయి. కొత్త సినిమాలనూ ఒప్పుకుంటున్నారు. కానీ, రాజకీయ పార్టీ మాత్రం పురుడుపోసుకోలేదు. రజనీ అంటే ప్రాణం పెట్టే అభిమానులు, మద్దతు దారుల నిరీక్షణ ఫలించనేలేదు. రజనీ పార్టీ ఆవిర్భావం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. డిసెంబర్ 31 నుంచి అభిమానుల సమావేశాలకు కాస్త ముందుగానే, అభిమాన సంఘాలు తలైవర్ రజనీకాంత్ ను తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా పేర్కొంటూ, పాటలను, పోస్టర్లను విడుదల చేసి హడావుడి చేశారు. ఆ హంగామా అంతా వృథా అయిపోయినట్లే కన్పించింది.
2018 జనవరి 1న అభిమానుల సభలో రజనీ ప్రసంగిస్తూ తమిళనాట జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే రాజకీయల్లో మార్పు రావల్సిన అగత్యాన్ని నొక్కి చెప్పారు. తమిళనాట రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు తన సంసిద్ధతను ప్రకటించారు. దీంతో రానున్న కొద్ది నెలల్లోనే వినూత్న రాజకీయ పార్టీ అవిర్భావం ఖాయమనే వార్తలు ప్రచారంఅందాయి. అదే సమయంలో మరో మహానటుడు కమల్ హాసన్ తాను రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ప్రకటించడం విశేషం. కమల్ చకచకా పావులు కదిపారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు జరపడంతో పాటు రాజకీయ పార్టీని కూడా ప్రకటించారు. పలు కార్యకలాపాలు చేపట్టారు.
రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నాటి నుంచి అభిమాన సంఘాల కూటమి రజనీ మక్కళ్ మండ్రం కింది స్థాయినుంచి పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ఆరంభించింది. అదే సమయంలో ఓ చిత్రం ఆడియో ఫంక్షన్ సందర్భంగా రజనీ కాత్ తమ రాజకీయ పార్టీ అతిత్వరలో వస్తుందని, కేవలం ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా 234 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆనాటి నుంచి తమిళనాడు ప్రజల చూపులన్నీ సూపర్ స్టార్ రజనీ పైనే. ఎప్పుడెప్పుడు రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందో.. అన్న అంశంపైనే చర్చోపచర్చలు…
బీజేపీతో జతకడతారని, డిఎంకె ఇతర రాజకీయ పార్టీలకు మద్దతిస్తారని వివిధ పత్రికల్లో ప్రచారం కూడా జోరందుకుంది. కానీ, రజనీకాంత్ పెదవి విప్పలేదు. పార్టీ ఏ తేదీన ప్రారంభిస్తారన్న విషయంలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సరికదా.. పత్రికల్లో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించలేదు.
రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతున్నదే. రజనీ కాంత్ కూడా కొన్ని ఏళ్లుగా రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై స్పందిస్తూ వచ్చారు. కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు పట్ల నిరసన వ్యక్తం చేశారు. సినీ కళాకారులు ఈ సందర్భంగా చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన పలు రాజకీయపార్టీలు, సామాజిక వర్గాల ఆగ్రహాన్ని చవిచూశారు.
రజనీకాంత్ మొదటి నుంచి తన అభిప్రాయాలను సుస్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించడం తెలిసిందే. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నిజాయితీ, జవాబుదారీతో కూడిన స్పష్టమైన రాజకీయాలు అవసరమని, మతపరమైన, కులపరమైన వివక్షతకు తావులేని రాజకీయాలే తనకు ఆదర్శమని స్పష్టం చేయడంతో రజనీకాంత్ పార్టీ అదే సిద్ధాంతాలతో ఏర్పడుతుందనే భావన కలిగింది. అలాగే ఎంజీఆర్ తరహా ప్రభుత్వాన్ని, అలాంటి రాజకీయాన్ని తమిళనాడు ప్రజలకు అందించగలనన్న విశ్వాసాన్ని ప్రకటించడంతో ఇక రాజకీయ పార్టీ ప్రకటనే తరువాయి అని అంతా భావించారు. పార్టీ రూపు దిద్దుకోలేదు.
రజనీకాంత్ అడపాదడపా రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనల సందర్భంగా సామాన్య ప్రజల పక్షాన నిలిచి స్పందించడంతో వార్తలలో ప్రముఖుడిగా నిలుస్తూనే ఉన్నారు. తూత్తుకుడి లో కాపర్ ప్లాంట్ వ్యతిరేకంగా జరిగిన ఆందోళన నేపధ్యంలో పోలీసు కాల్పులకు 13 మంది మరణిస్తే.. తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును దుమ్మెత్తిపోశారు.
నెలలు గడుస్తున్నా.. రాజకీయ పార్టీ ఏర్పాటు వాయిదా పడుతూనే ఉంది. రజనీ మక్కళ్ మండ్రం అభిమానుల సంఖ్య కోటి దాటింది. ఆ సంబరాల సందర్భంగా రాజకీయ పార్టీ నేడో రేపో అన్నట్లు ప్రచారం జరిగింది. రజనీ కాంత్ అన్న సత్యనారాయణ, మిత్రులు ఏసీ షణ్ముగం, రజనీ సతీమణి లత రాజకీయ పార్టీ ఏర్పాటుపై తరచు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. రజనీ ఒకసారి చెబుతే వందసార్లు చెప్పినట్లు. ఆయన ఎంచుకున్న మార్గాన్ని వీడడు.. మడమ తిప్పడు.. అని రజనీకాంత్ సతీమణి లత నిర్ద్వంద్వంగా ప్రకటించడం తో 2019 కొత్త సంవత్సరం తొలి నెలలోనే రజనీ పార్టీ ఆవిర్భావం ఖాయమని తేలింది. 2019 నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇక త్వరలోనే పార్టీ ఏర్పాటు తేదీ ప్రకటన, పార్టీ పేరు, పార్టీ గుర్తు వంటి కీలక ప్రకటనలు వెలువడవచ్చు. అలాగే రజనీ రాజకీయ విజన్.. సుస్పష్టం కాగలదు.
(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, 9705347795)