Minister Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సమాజంలో మార్పు తేవాలి: మంత్రి లోకేశ్‌

విద్యార్థులు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి కీలకపాత్ర పోషించాలని, సమాజంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆకాంక్షించారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన ‘నమూనా అసెంబ్లీ’ని తిలకించిన అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు.

రాజ్యాంగంపై అవగాహన ముఖ్యం: యువగళం పాదయాత్ర సమయంలో తనకు ఎదురైన అనుభవాలను మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో పంచుకున్నారు. “పాదయాత్రలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగాను. నన్ను అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19 ప్రకారం ‘రైట్ టు ఫ్రీడమ్’ గురించి వివరించినా, వారు ఉన్నతాధికారులతో మాట్లాడుకోమనే వారు. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలకు రాజ్యాంగ హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను,” అని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ ప్రవేశపరీక్ష వ్యాసంలో కూడా ప్రజాసేవ, పాజిటివ్ లీడర్‌షిప్‌ ద్వారానే మార్పు సాధ్యమని రాసినట్లు గుర్తుచేశారు.

నమూనా అసెంబ్లీ.. ప్రజాస్వామ్యానికి తరగతి గది: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుండి 7 లక్షల మందితో పోటీపడి ఎంపికైన విద్యార్థులు అసెంబ్లీకి రావడం ఆనందదాయకమని లోకేశ్ అన్నారు. ఈ రోజు చూసింది ‘లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ’ అని అభివర్ణించారు. రైతుల సమస్యలు, సెల్ ఫోన్ అడిక్షన్, డ్రగ్స్ వంటి అంశాలపై విద్యార్థులు మాట్లాడిన తీరును ప్రశంసించారు. శాసనసభలో ఎమోషన్స్ ఉంటాయని, వాటిని అదుపు చేసుకుని హుందాగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని సూచించారు.

‘బాలల రాజ్యాంగం’ ఆవిష్కరణ: ఏడాది క్రితం ఇచ్చిన మాట ప్రకారం, పిల్లల కోసం రూపొందించిన ‘బాలల భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, సర్దార్ పటేల్ వంటి మహనీయుల స్ఫూర్తిదాయక గాథలతో, పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

నైతిక విలువలే పునాది: ప్రతి విద్యార్థి జీవితంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని, తాను ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి భువనేశ్వరి కారణమని లోకేశ్ ఉద్వేగంగా చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్లు.. ‘తల్లికి చెప్పలేని నిర్ణయం ఏదీ తీసుకోకూడదు’ అనే మాటను విద్యార్థులు పాటించాలన్నారు. నైతిక విలువల ఆవశ్యకతను గుర్తించే చాగంటికి కేబినెట్ ర్యాంకు ఇచ్చి సలహాదారుగా నియమించామని వెల్లడించారు.

మహిళలను గౌరవించడమే అభివృద్ధికి నిదర్శనం: సమాజంలో మహిళలను కించపరిచే పదజాలానికి అడ్డుకట్ట వేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. “గాజులు తొడుక్కున్నావా? చీర కట్టుకున్నావా? వంటి పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆడవారిని మగవారితో సమానంగా గౌరవించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది,” అని స్పష్టం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబుపై జగన్ సెటైర్లు || Ys Jagan Funny Satires On CM Chandrababu At Kadapa Tour || TR