శివ-శక్తుల కొలువైన ఆలయం.. దేశంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేత్రం ఇదే..!

భారతదేశంలో పవిత్రత, చరిత్ర, కళామహిమాన్విత క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శ్రీశైలం కూడా ఒకటి. నల్లమల అరణ్య గర్భంలో ఉన్న ఈ మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా నిలిచి.. శివ-శక్తుల ఏకత్వానికి ప్రతీకగా ఈ హహా ఆలయం నిలుస్తోంది. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా అమ్మవారు ఇక్కడ ప్రధాన దైవాలు. ఒకే స్థలంలో శివుడు, శక్తి సాక్షాత్కారమివ్వడం ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను తీసుకొచ్చింది.

ప్రాచీన శిల్పకళ, శాసనాలు, ప్రతిమలు ఇక్కడి ఆలయానికి ప్రత్యేక శోభనిస్తాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు ఇక్కడ వెలుగులోకి రావడం వల్ల ఈ ప్రాంతం ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్నదని స్పష్టమవుతుంది. యాత్రికుల అడుగుజాడలను సాక్షిగా నిలిపే సాక్షి గణపతి ఆలయం కూడా ఈ ప్రాంతంలో భక్తులకు విశేష అనుభూతి కలిగిస్తుంది. యాత్రికుడు దర్శనం పూర్తి చేశాడా లేదా అనేది స్వయంగా శివుడికి చెప్పే గణపతి విగ్రహం ఉందని నమ్మకం.

శ్రీశైలం ఆలయం కేవలం భక్తి క్షేత్రమే కాక, చరిత్రకీ ఒక అద్దం. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర మహారాజులు ఈ దేవాలయానికి ఎన్నో సేవలు అందించారు. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడ నివసించి భక్తి సేవల్లో పాల్గొన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతనిచ్చేవి ఆలయంలోని విశేషాలు. నిత్యం వెలుగుతూ ఉండే అఖండ దీపం భక్తుల మనసులను పులకరింపజేస్తుంది. ఒకే రాయితో చెక్కబడిన 20 టన్నుల బరువైన నంది విగ్రహం కళాత్మకతకు ఉదాహరణగా నిలుస్తుంది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో దర్శనమిచ్చే పాండవుల లింగాలు, పురాణ వైభవాన్ని మళ్లీ గుర్తు చేస్తాయి.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే పాగాలంకరణ సేవ ప్రత్యేక ఆకర్షణ. ఆలయ విమాన శిఖరంపై త్రిశూలానికి పాగా కట్టి, నందుల కొమ్ములకు కడతారు. ఇది కేవలం చిమ్మ చీకటిలోనే జరిగే పూజ కావడం దీని రహస్యాన్ని, పవిత్రతను మరింత పెంచుతుంది. రోజూ జరిగే శాస్త్రోక్త నిత్య కైంకర్యాలు భక్తుల మనసుల్లో భరోసా నింపుతాయి. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా అమ్మవారితో పాటు పరివార దేవతలకు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చే యాత్రికుడు కేవలం దర్శనం మాత్రమే కాక, చరిత్ర, కళ, భక్తి, సాహిత్య సౌందర్యాల సమ్మేళనాన్ని అనుభవిస్తాడు.

శ్రీశైలం యాత్ర అంటే భక్తికి పర్యాయపదం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట ఉండడం వల్ల ఈ మహాక్షేత్రం “శివ-శక్తుల కలయిక స్థలం”గా విశ్వవ్యాప్తంగా కీర్తి గాంచింది. ప్రతి హిందువు జీవితంలో ఒకసారి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రంగా శ్రీశైలం నిలిచిపోయింది.