ఆగస్టు 23న శనివారం, అదీ అమావాస్య రోజు. శ్రావణ మాసం చివరి వారంలో ఈ రెండు తిథులు కలవడం వల్ల ఈ రోజు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా శనివారం అంటే శనిదేవుడి రోజు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రత్యేక పూజలు చేస్తారు. అదే సమయంలో అమావాస్య కూడా కావడంతో ఈ రోజు మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినదిగా పరిగణిస్తున్నారు. కానీ జాగ్రత్తలు పాటించకపోతే శని ప్రభావాలు పెరిగే అవకాశముందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజున ఇనుము వస్తువులు, నల్లని వస్తువులు, నూనె, ఉప్పు వంటివి ఇంటికి తెచ్చుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. కొత్త వాహనాలు, బట్టలు, చెప్పులు కొనడం కూడా దూరంగా ఉండాలని అంటున్నారు పండితులు. ప్రత్యేకంగా ఎలినాటి, అర్దష్టమ, సాడేసాతి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. శనివారం రోజు తగువులు, గొడవలు దూరంగా ఉంచుకోవడం అత్యంత శ్రేయస్కరం.
అదేవిధంగా ఈ రోజున చేసే దానాలు, పూజలు మరింత ఫలితాలను ఇస్తాయని విశ్వాసం ఉంది. శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, నల్లని వస్త్రాలు సమర్పించడం, నెయ్యితో దీపారాధన చేయడం శుభప్రదమని చెబుతారు. ఆవులకు, శునకాలకు రోట్టెలు, పిండివంటకాలు పెట్టడం, పేదవారికి అన్నదాన, వస్త్రదానాలు చేయడం ద్వారా శని కటాక్షం లభిస్తుందని నమ్మకం.
శ్రావణ మాసం దేవునికి అత్యంత ప్రీతికరమైనదే. ఈ మాసంలో శనివారం రోజులు మరింత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అలాంటి శ్రావణ శనివారమే కాకుండా అమావాస్య కలసి రావడం ఆధ్యాత్మిక దృష్ట్యా విశిష్టమైందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున తప్పనిసరిగా దేవుని స్తోత్రాలు చదవడం, పురాణాలు వినడం, భక్తితో గడపడం వల్ల అన్ని దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది.
అంతేకాదు ఆగస్టు 23న పూజలు, దానాలు మాత్రమే కాదు, శనిదేవుడికి సంబంధించి చేసే శాంతి హోమాలు కూడా ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజును సానుకూలంగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంది.
