పవన్‌తో వీర్రాజు భేటీ: ఎక్కడో తేడా కొడ్తోందే!

somu veerraju meets pawan kalyan

బీజేపీ కేంద్ర నాయకత్వం మనల్ని తగు రీతిలో గౌరవిస్తోంది.. రాష్ట్రంలో మాత్రం కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తోంది..’ అంటూ ఇటీవల పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం సందర్భంగా, ఆ కమిటీ సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రస్తావించడం, ఆ అంశానికి మీడియాలో అధిక ప్రాధాన్యత దక్కడం.. వెరసి, ఏపీ బీజేపీ నేతల్లో తగిన ‘మార్పు’కి అయితే కారణమయినట్లుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అంతేనా, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయమై ‘మారిన స్వరం’తో వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులోంచి, జనసేన కోర్టులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అంటే, తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేయడం దాదాపు ఖాయమయ్యిందని అనుకోవాల్సిందే. ‘బీజేపీ అభ్యర్థి పోటీ చేసినా, జనసేన అభ్యర్థి పోటీ చేసినా.. ఇరు పార్టీలూ సమానంగా సహాయ సహకారాలు అందించుకుంటాయి..’ అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. వాస్తవానికి సోము వీర్రాజు గతంలో చేసిన వ్యాఖ్యలు వేరు.

somu veerraju meets pawan kalyan
somu veerraju meets pawan kalyan

‘తిరుపతిలో మేమే పోటీ చేస్తాం.. జనసేన పార్టీ మాకు మద్దతిస్తుంది..’ అని సోము వీర్రాజు ప్రకటించేశారు. ‘అదేంటీ, రెండు పార్టీలూ కలిసి కూర్చుని చర్చించుకున్నాక కదా, అభ్యర్థి ఎవరన్నది తేల్చాల్సింది..’ అంటూ జనసేన వర్గాలు కొంత ఆందోళన వ్యక్తం చేశాయి. అయినాగానీ, బీజేపీ నుంచి ‘జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారు..’ అని బీజేపీకి చెందిన మరికొందరు నేతలు ఇంకాస్త గట్టిగా నినదించాయి. అయితే, ఇప్పుడు సీన్ మారింది. ‘జనసేనకు మద్దతిస్తాం..’ అని చెప్పలేదుగానీ, ‘కలిసి పోటీ చేస్తాం.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాం.. ఎవరు పోటీ చేసినా, ఇంకొకరి మద్దతు సంపూర్ణంగా వుంటుంది..’ అని పవన్‌తో భేటీ అనంతరం సోము వీర్రాజు ప్రకటించడం ఏపీ కమలం పార్టీలో అనూహ్యమైన మార్పుగానే చూడాలేమో. అయితే, సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడైనా, తిరుపతి ఉప ఎన్నిక విషయమై ఆయనకు పార్టీలో ఎంత గౌరవం వుంది.? ఆయన మాటల్ని ఎంతమంది లెక్క చేస్తారు.? అన్నది కూడా వేచి చూడాల్సిందే.