చిత్తూరు జిల్లా వైసీపీలో ఏదో జరుగుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిథుల్ని లెక్క చేయడంలేదు. ఎందుకిలా.? అధికార పార్టీ ప్రజాప్రతినిథులకు విలువ లేకపోవడమంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. పైగా, ఫైర్ బ్రాండ్ రోజాని, అధికారులు లెక్కచేయకపోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రాజకీయాల్లో రోజా చాలా చురుగ్గా వుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయమై రోజా చూపే శ్రద్ధ అంతా ఇంతా కాదు. కానీ, ఆమెను అధికారులు లెక్క చేయడంలేదు. ఆ విషయాన్ని స్వయంగా ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి యెదుట చెప్పుకుంటూ కన్నీరు పెట్టారు రోజా. ఓ మహిళా ప్రజా ప్రతినిథి, పైగా ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ కూడా అయిన రోజా విషయంలో అధికారులెందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
జిల్లాకు చెందిన ఓ మంత్రిగారు కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. సదరు మంత్రికీ, ఎమ్మెల్యే రోజాకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండడం మరో ఆసక్తికర అంశం. రోజా అంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితురాలు. సీఎం జగన్, రోజా పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తారు. సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో బ్యాలెన్స్ కుదరకపోవడంతో రోజాకి మంత్రి పదవి దక్కలేదుగానీ, లేకపోతే ఆమెకు జగన్ మంత్రివర్గంలో కీలక స్థానం దక్కి వుండేదే. త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే, రోజాకి మంచి ఛాన్స్ వస్తుందనే ప్రచారమూ జరుగుతోంది. కానీ, ఇంతలోనే రోజాకి అధికారుల నుంచి తీవ్రస్థాయిలో సహాయ నిరాకరణ ఎదురవుతోందట. కనీసం ప్రోటోకాల్ కూడా అధికారులు పాటించడంలేదట. ఇళ్ళ పట్టాల పంపిణీ వ్యవహారానికి సంబంధించి అధికారులు తనకు సమాచారం ఇవ్వడంలేదంటూ వాపోతున్నారు. ఏ పార్టీలో వున్నా పాపం రోజాకి ఆయా పార్టీల నుంచి అవమానాలు తప్పడంలేదన్నమాట. అధినేత వైఎస్ జగన్ కల్పించుకుంటే తప్ప, ఎమ్మెల్యే రోజమ్మకి న్యాయం జరిగేలా లేదు.