చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన మహిళా బ్యాటర్ గా రికార్డు..!

మహిళల క్రికెట్‌లో భారత ఓపెనర్ సెన్సేషన్ స్మృతి మంధాన మరోసారి చరిత్ర సృష్టించింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆడుతూ ఆమె వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు.. భారత మహిళల క్రికెట్‌లో ఒక కొత్త పేజీ.

మంధాన ఈ మ్యాచ్‌కు ముందు 5,000 పరుగుల మైలురాయికి కేవలం కొన్ని పరుగుల దూరంలో ఉండగా, తన 112వ వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సాధించింది. 21వ ఓవర్‌లో ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ వేసిన బంతిని అద్భుతంగా లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలచి చరిత్రలో తన పేరు చెక్కించుకుంది. ఈ రికార్డు ఇంతవరకు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ పేరిట ఉండగా, ఆమె 129 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించింది. కానీ మంధాన కేవలం 112 ఇన్నింగ్స్‌ల్లోనే రికార్డు బద్దలు కొట్టింది. ఈ జాబితాలో టేలర్ తర్వాత సుజీ బేట్స్ 136 ఇన్నింగ్స్‌లలో, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 144 ఇన్నింగ్స్‌లలో, చార్లెట్ ఎడ్వర్డ్స్ 156 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు. మంధాన మాత్రం వీరందరినీ వెనక్కు నెట్టింది.

మ్యాచ్‌లో మంధాన ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతం. 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో అవుటయింది. ఈ వరల్డ్‌కప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఆమె, ఈ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపింది. 2024-25 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటికే 974 పరుగులు సాధించి ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా మరో రికార్డును సొంతం చేసుకుంది.

సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఆమె తన ఫామ్‌ను చూపిస్తూ ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలతో మెరిసిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ వంటి భారీ వేదికపై ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ద్వారా మంధాన ప్రపంచ క్రికెట్‌లో తన స్థాయిని మరోసారి నిరూపించింది. మంధాన రికార్డుపై మాజీ ప్లేయర్లు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.