క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా.. కాలిఫోర్నియాలో స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్..!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసుకొని.. భూమిపైకి సురక్షితంగా చేరారు. ఈ రోజు (2025, జూలై 15) మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రయాణించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, అమెరికా కాలిఫోర్నియా తీరంలోని శాన్ డియాగో సముద్రతీరంలో విజయవంతంగా స్ప్లాష్ డౌన్ అయ్యింది. 22 గంటల ఉత్కంఠ భరిత అంతరిక్ష పునఃప్రయాణం అనంతరం శుభాంశు, ఆయనతో పాటు ప్రయాణించిన అంతరిక్షయాత్రికులు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు క్షేమంగా భూమికి తిరిగి చేరుకున్నారు.

యాక్జియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా నేతృత్వంలోని జట్టు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లి అనేక పరిశోధనలతో పాటు ఆక్స్పిరిమెంట్లను విజయవంతంగా పూర్తి చేసింది. జూలై 14న సాయంత్రం 4.30కి ISS నుంచి అన్ డాకింగ్ పూర్తయి, భూమి ప్రయాణం మొదలైంది. అంతరిక్షంలో 20 రోజుల సుదీర్ఘ తపనలకు తెర వేసి, మళ్లీ భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఆ క్షణాలు విజ్ఞానరంగానికి కొత్త పుటలు రాశాయి.

డీ ఆర్బిట్ బర్న్ దశలో డ్రాగన్ క్రాఫ్ట్ 2.30 గంటలకు భూ కక్షలోకి ప్రవేశించగా, 18 నిమిషాల పాటు ఇంధన వినియోగం జరిపి భూ వాతావరణంలోకి ప్రవేశానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ సమయంలో 7 నిమిషాలు డ్రాగన్ కమ్యూనికేషన్‌ సిగ్నల్స్ కోల్పోవడంతో అందరూ కాస్త కంగారు పడ్డారు.. అనంతరం అన్ని సాంకేతిక పద్ధతులు సజావుగా పనిచేశాయి.

స్పేస్ షిప్ సముద్రతీరానికి చేరిన తర్వాత 16 నిమిషాల పాటు పారా చూట్ల సహాయంతో స్ప్లాష్ డౌన్ ప్రక్రియ పూర్తయింది. విశ్వ వ్యోమంలోకి వెళ్లి భూమికి సజావుగా తిరిగి రావడం మరోసారి మానవ పరిజ్ఞానానికి సాక్ష్యమైంది. నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విజయం ముందు సంబరాల్లో మునిగిపోయారు. వారి ఉత్సాహాన్ని స్వీట్లు పంచుకుంటూ, అభినందనలు తెలుపుకుంటూ వ్యక్తపరిచారు. శుభాంశు శుక్లా క్షేమంగా తిరిగి భూమికి చేరుకోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక యాక్జియం-4 మిషన్ విజయవంతం కావడం దేశీయ అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇచ్చే అవకాశమని నిపుణులు భావిస్తున్నారు.