శ్రావణ మాసంలో ఇవి తినకూడదంట.. ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఇవే..!

శ్రావణమాసం ప్రారంభం కాగానే గ్రామాల నుండి నగరాల వరకు ఒక పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ మాసాన్ని శివుడికి అత్యంత ప్రీతికరమని హిందూ సంప్రదాయం చెబుతోంది. అందువల్ల ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు చేసి శివుని అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తారు. కానీ ఈ మాసంలో కొన్ని ఆహారపదార్థాలను వాడరాదు అని పెద్దలు చెప్పే ఆచారాల వెనుక కేవలం మతపరమైన విశ్వాసమే కాదు, ఆరోగ్యపరమైన, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలం రావడం, వాతావరణ మార్పులు, గాలి తేమగా మారడం వంటి కారణాలతో శరీరంలో పిత్త, కఫ దోషాలు పెరుగుతాయని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు కొన్ని ఆహార నియమాలను కట్టుబడి పాటించేలా… శ్రావణ మాసంలో ఆకుకూరలు తిన కూడదని ఎందుకు చెబుతారో తెలుసుకుంటే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. మతపరంగా.. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైనది. శివుడు ప్రకృతిని అధికంగా ప్రేమించే దేవుడు. కాబట్టి ఈ మాసంలో ఆకులను కోయడం ద్వారా పర్యా వరణానికి హాని చేయడం శివుని కోపానికి కారణమని పెద్దలు నమ్ముతారు. పైగా పూజల్లో కూడా ఆకులను ఉపయోగించకుండా ఇతర పుష్పాలతో అర్చనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

వైద్యపరంగా చూస్తే, వర్షాకాలం ఆకుకూరలకు అనుకూల కాలం కాదు. ఈ సీజన్‌లో ఆకుకూరల్లో పురుగులు, బాక్టీరియా, ఫంగస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, మట్టి, బురద వలన ఈ ఆకులపై వ్యాధికారక సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. సరైన శుద్ధి లేకుండా వీటిని తినటం వలన జీర్ణ సమస్యలు, అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా వర్షాకాలంలో శరీరంలో పిత్త దోషం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ఆకుకూరలు పిత్తాన్ని మరింత ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆకుకూరలు తినకూడదని పెద్దలు చెబుతున్నారు.

పెరుగు విషయంలోనూ అదే తరహా కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తీసుకోవడం శరీరంలో చల్లదనాన్ని పెంచి జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. పెరుగు కఫ దోషాన్ని ప్రేరేపిస్తుంది. పెరుగు తీసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే స్వల్పంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలను కూడా ఈ కాలంలో జాగ్రత్తగా తీసుకోవాలి. పశువులు తిన్న పచ్చిగడ్డి, తేమ కారణంగా పాలలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలను పూర్తిగా మరిగించి మాత్రమే వినియోగించాలి.

మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని శ్రావణమాసంలో చెప్పే ఆచారం వెనుక కూడ శాస్త్రీయ కారణాలున్నాయి. వర్షాకాలంలో చేపలు, మాంసం తినటం వలన ఫుడ్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ. పైగా ఉపవాసాలు శివారాధన సమయంలో తామసిక ఆహార పదార్థాలు శారీరక, మానసిక శాంతికి విఘాతం కలిగిస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి తినటం శరీరంలో వేడిని పెంచి కామవికారాలను ప్రేరేపిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల భక్తులు వీటిని నివారిస్తారు.

ఇలా శ్రావణ మాసంలో పాటించే ఆహార నియమాలు మన పూర్వీకుల ఆలోచనలోని గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ప్రకృతితో సమన్వయం, శరీరానికి ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు భంగం రాకుండా ఉండేలా రూపొందించిన ఈ ఆచారాలను ఈ తరానికి కూడా బోధించడం అవసరం. ఇవి కేవలం ధర్మ విశ్వాసాలకు మాత్రమే కాదు, వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని సంతులితంగా ఉంచడానికీ తోడ్పడతాయి. అందువల్ల శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటిస్తూ శివుని ఆశీస్సులు పొందాలని పెద్దలు చెబుతున్నారు.