శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. మీ ఇంట డబ్బుకి లోటుండదు..!

శ్రావణ మాసం ప్రారంభమైంది. హిందూ సంప్రదాయ calendar ప్రకారం అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణం ఒకటి. జూలై 25వ తేదీతో ఈ ఏడాది శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని స్మరించుకుంటే.. ఇంటికి శుభం, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది ఈ ప్రత్యేకమైన మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

శ్రావణమాసంలో శుక్రవారం ఉదయం నుంచే భక్తులు ఇంటిని శుభ్రంగా చక్కబెట్టడం ప్రారంభించారు. గుమ్మం వద్ద ముగ్గులు వేయడం, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టడం, దీపాలు వెలిగించడం ద్వారా ద్వార లక్ష్మి పూజ నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి పుష్పాలతో, కాసుల మాలతో అలంకరిస్తున్నారు. వినాయకుడు, సరస్వతిదేవి చిత్రాలకూ పూజ నిర్వహించడం సాధారణంగా ఈ రోజు పద్ధతి.

పూజా సమయంలో ఐశ్వర్య దీపం వెలిగించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఉప్పుతో దీపాన్ని రూపొందించి, నువ్వుల నూనె లేదా ఆవునెయ్యితో దీపారాధన చేస్తారు. దీని వల్ల ఐశ్వర్యం వచ్చి నిలుస్తుందన్న నమ్మకం ఉంది. పూజా గదిలో వట్టివేర్ల మాలలు వేసి మంచి వాసన వచ్చేలా చూసుకుంటారు. పసుపు, జావాయి పౌడర్, పచ్చకర్పూరం, పూలతో నీరు కలిపి ఒక గాజు గ్లాసులో ఉంచడం ద్వారా పూజా ప్రదేశం సుగంధవంతంగా మారుతుంది.

ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలనుకునేవారు కూడా ఎక్కువమంది. సాధారణంగా తిథుల కంటే శుక్రవారాలకే ప్రాధాన్యతనిచ్చే ఈ వ్రతాన్ని, శ్రావణ మాసంలోని ఏ శుక్రవారానైనా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. పూజా విధానంలో బియ్యం పిండి ఉపయోగించి ముగ్గులు వేయడం, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ఇలానే శ్రద్ధతో, భక్తితో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుందని, శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణ శుక్రవారాలు అన్నీ కూడా ఇదే విధంగా పూజలు చేసేందుకు అనుకూలంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.