అమెరికాలో కాల్పుల కలకలం… 22 మంది మృతి – 60 మందికి గాయాలు!

అమెరికాలోని లెవిస్టన్, మైనేలో బుధవారం రాత్రి జరిగిన సామూహిక కాల్పుల్లో ఇప్పటివరకూ 22 మంది మరణించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కాల్పుల్లో సుమారు 50 – 60 మంది గాయపడినట్లు చెబుతున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాల్పులకు సంబంధించిన అనుమానితుడి ఫోటోలను ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది!

సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు! ఈ ఘటనపై మైనే రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ఇందులో భాగంగా… “లెవిస్టన్‌ లో యాక్టివ్ షూటర్ ఉన్నాడు” అని ట్విట్టర్ లో తెలిపారు. ఇదే సమయంలో… “మేము ప్రజలను ఆశ్రయం పొందమని అడుగుతున్నాము. దయచేసి తలుపులు లాక్ చేసుకుని ఇంటి లోపలే ఉండండి” అని పోలీసులు తెలిపారు.

ఇదే సమయంలో ఏదైనా అనుమానం కలిగించే ఘటన కానీ, వ్యక్తులు కానీ కనిపిస్తే 911 కి కాల్ చేయమని మైనే రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇదే సమయంలో ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ విడుదల చేసిన అనుమానితుడి ఫోటోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లాక్ జీన్ ఫ్యాంట్ ధరించి, గడ్డం ఉన్న వ్యక్తి కాల్పులు జరుపుతున్నాడని చెబుతున్నారు.

ఇదే సమయంలో… ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని.. అన్ని వ్యాపారాలు వారి వారి షాపులను, ఆఫీసులనూ మూసివేయాలని కోరారు. ఇదే సమయంలో… మూడు వేర్వేరు వ్యాపార ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని అంటున్నారు! ఇందులో భాగంగా… వాల్‌ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్కీంగీస్ బార్ & గ్రిల్ రెస్టారెంట్, స్పేర్‌ టైం రిక్రియేషన్ వద్ద దుండగుడు ఈ కాల్పులు జరిపాడని అంటున్నారు.

ఇక ఈ ఘటనపై అధ్యక్షుడు జో బిడెన్‌ కు వెంటనే సమాచారం అందించగా.. మైనే గవర్నర్ జానెట్ మిల్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలుస్తుంది.