వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీతో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా లాభమే తప్ప నష్టం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్‌కి గ్రౌండ్ లెవల్‌లో వైసీపీ అభిమానుల మద్దతు వుంది. ఇది పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా. సందర్భాన్ని బట్టి వైఎస్సార్ అభిమానుల మద్దతు టీఆర్ఎస్, బీజేపీ మధ్య అటూ ఇటూ మారుతోంది. ఆ ఓటు బ్యాంకుని మరింత బలోపేతం చేసే దిశగా షర్మిలతో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా మీద తెలంగాణలో జగన్ అయినా, షర్మిల అయినా రాజకీయం చేయడం అసాధ్యం. ఈ కారణంతోనే కొత్త రాజకీయ పార్టీని షర్మిల ద్వారా వైఎస్ జగన్ తెరపైకి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందు కోసం వైసీపీ – టీఆర్ఎస్ మధ్య చర్చలు జరిగాయనీ, బీజేపీతో కూడా వైసీపీ ముఖ్యులు చర్చించారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, వైసీపీ మాత్రం తెలంగాణలో షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదనీ, జగన్ సోదరిగా షర్మిల పట్ల తమకు అభిమానం ఎప్పుడూ వుంటుందని స్పష్టతనిచ్చేస్తున్న విషయం విదితమే. దేశంలో జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అత్యవసరంగా షర్మిల పార్టీ తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలకు కారణమైన మాట వాస్తవం. రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. అవసరాన్ని బట్టి ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, షర్మిల ద్వారా కొత్త పొలిటికల్ గేమ్ షురూ చేసిందనుకోవాలో.. ప్రతిపక్షం అనే హోదా కోసం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి బీజేపీనే షర్మిలను రాజకీయంగా ఉపయోగించుకుంటోందనుకోవాలో.. కారణం ఏదైనా, ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ.. ఈ రెండు పార్టీలకూ షర్మిల పార్టీ ఉపయోగపడే అవకాశాలే ఎక్కువు.