“ఒరిజినల్” : ప్రపంచ వేదికపై కిర్రు సెప్పు, కర్రసాము!

తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం.. అంతర్జాతీయ సినీ అవార్డుల వేదికపై తెలుగు వాడి రోమాలు నిక్కబొడుచుకునే నిలబడే సందర్భం. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఇంగ్లిష్ వాడి పెదాలపైనా… పొలం గట్టు, పోట్ల గిత్త, కిర్రు సెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, మిరప తొక్కు వంటి పదాలు నాట్యం చేస్తున్న సమయం. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ గోస్ టు “నాటు నాటు ఫ్రం ట్రిపుల్ ఆర్” అనే శబ్ధం వినిపించిన క్షణం.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానుల హర్షధ్వానాల మధ్య తెలుగువాడి చేతిలో ఆస్కార్ అవార్డు కనబడింది.. ఆ “ఒరిజినల్” సీన్ చూడటానికి రెండు కళ్లూ చాలలేదు!

అవును… అంతర్జాతీయ సినీ అవార్డుల వేదికపై తెలుగు సినిమా పాట సత్తా చాటింది. ఆస్కార్ పుస్తకంలో తెలుగు సినిమా పాటకు ఒక పేజీ దక్కింది. దీంతో.. మరిన్ని పేజీలు ఖాళీగా పెట్టుకోమని ఆస్కార్ టీం కు టాలీవుడ్ హింట్ ఇచ్చింది! అవును… ట్రిపుల్ ఆర్ సినిమాలోని “నాటు.. నాటు..” బెస్ట్ ఒరిగిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకుంది.

ఈ అవార్డు కోసం ఆర్.ఆర్.ఆర్. సినిమా టీం మాత్రమే కాదు… తెలుగు సినీ ప్రేక్షకుడు మాత్రమే కాదు… యావత్ భారతదేశ సినిమాభిమాని ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు వాస్తవరూపం దాల్చాయి. ఆర్.ఆర్.ఆర్. అభిమానులంతా అనుకున్నట్లుగానే.. తెలుగు సినీ అభిమానులంతా కోరుకున్నట్లుగానే.. అంతర్జాతీయ సినీ వేడుకల వేదికపై “తెలుగు సినిమా పతాకం” ఎగిరింది.. ప్రపంచ సినీఅభిమానుల హర్షధ్వానాల మధ్య “తెలుగు పాట పాతాకం” రెపరెపలాడింది.

అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావాలంటే హిందీ సినిమాలవైపూ… హాలీవుడ్ స్థాయిలోకి వెళ్లాలంటే బాలీవుడ్ వైపు చూసే రోజులు పోయాయని.. భారతీయ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే కాదు అని.. అంతకు మించి ఒక ఇండస్ట్రీ ఉందని.. దాని పేరు “టాలీవుడ్” అని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు చాటి చెప్పింది ఆర్.ఆర్.ఆర్.!

అవును.. ఇదీ రాజమౌళి క్రియేటివిటీ కి దక్కిన విజయం – కీరవాణి స్వరాలు పొందిన గుర్తింపు – చంద్రబోస్ సాహిత్య పాండిత్యానికి దక్కిన అంతర్జాతీయ స్థాయి గౌరవం – రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ల గాత్రాలకు దక్కిన గొప్పతనం… కలగలిపి భారతీయ సినిమాకి దక్కిన అరుదైన గౌరవం. ఫైనల్ గా… తెలుగు కళామతల్లికి దక్కిన విశిష్ట గౌరవం!

జన్నక్క రాజమౌళి మస్థిష్కంలోంచి ఒక ఆలోచన పుడితే… ఆ ఆలోచనకు కీరవాణి స్వరాలు సమకూర్చితే… ఆ స్వరాలకు చంద్రబోస్ కళం లోని నాలుగు సిరా చుక్కలు అక్షరాలుగా పురుడుపోసుకుంటే… ఆ స్వరాక్షరాలకు ప్రేం రక్షిత్ శివుడిని ఆవాహనం చేసుకున్నట్లుగా సిందులు సృషిస్తే… టాలీవుడ్ లోని టాప్ డాన్సర్స్ లిస్ట్ లో ఉన్న ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు దుమ్ములెగిసేలా కాలు కదిపితే… దాని పేరు – “నాటు – నాటు”! ఆస్కార్ అవార్డు పొందిన బెస్ట్ “ఒరిజినల్” సాంగ్!