బ‌యోపిక్‌ల‌ను ఎన్నిక‌ల కోణంలో చూడొచ్చా? పార్ట్ – 4

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కొద్దిరోజుల తేడాతో ఒకేసారి వ‌చ్చిన ప‌డుతోన్న బ‌యోపిక్‌ల సిరీస్‌లో మ‌రో ముఖ్య‌మైన మూవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. టైటిల్ ఖ‌రారు చేసిన‌ప్ప‌టి నుంచీ అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్ల‌ను ప‌రుగెత్తిస్తోన్న ఫ్లిక్ ఇది. చివ‌రి రోజుల్లో మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావును వివాహం చేసుకున్న ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఉంటుంది ఈ సినిమా. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాల‌కృష్ణ తీసిన ఎన్టీఆర్ `మ‌హా నాయ‌కుడు` ఎక్క‌డైతే ముగుస్తుందో.. అక్క‌డి నుంచే ఈ సినిమా ఆరంభ‌మౌతుంది. ఆ ఒక్క పాయింట్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నిజానికి- ఎన్టీఆర్ జీవితం మొత్తం ఒక ఎత్తు, వైస్రాయ్ రాజ‌కీయాలు ఒక ఎత్తు.

1994లో ఎన్టీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాతే అస‌లు క‌థ మొద‌లైంది. ల‌క్ష్మీపార్వ‌తిని బూచిగా చూపి, చంద్ర‌బాబు నాయుడు తెలుగుదేశం పార్టీని నిస్సిగ్గుగా హైజాక్ చేశారు. హైద‌రాబాద్‌లో ఫైవ్‌స్టార్ హోట‌ల్ వైస్రాయ్ వేదిక‌గా ఈ రాజ‌కీయ కుట్ర మొత్తం సాగింది. తెలుగుదేశం పార్టీని నిట్ట‌నిలువుగా చీల్చి పారేశారు చంద్ర‌బాబు నాయుడు. త‌న వెంట ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు ఉంటే, ఆ సంఖ్యను 50-60 మందిగా దిన‌ప‌త్రిక‌ల్లో త‌ప్పుడు క‌థ‌నాలు రాయించి, ఎన్టీఆర్ వ‌ర్గం ఎమ్మెల్యేల్లో భ‌యోత్పాతాన్ని సృష్టించారు.

అప్ప‌ట్లో అందుబాటులో ఉన్న‌ది కేవ‌లం ప్రింట్ మీడియా మాత్ర‌మే. అందులో వ‌చ్చే క‌థ‌నాల‌ను జ‌నం న‌మ్మ‌క త‌ప్ప‌క ప‌రిస్థితిని క‌ల్పించారు. ఇప్ప‌ట్లా సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండి ఉంటే ఎన్టీ రామారావుకు ఆ దుర్గ‌తి ప‌ట్టి ఉండేది కాదేమో! చంద్ర‌బాబు ఏది చెబితే అది అచ్చు వేయ‌డం ప్రింట్ మీడియాధిప‌తుల‌కు అప్ప‌టి నుంచే అల‌వాటైంది. ఆ అల‌వాటు కాస్తా కాల‌క్ర‌మేణా ఓ వ్య‌స‌నంలా మారింది. అదో దుర్వ్య‌స‌నం అని ప్ర‌త్యేకించి చెప్పుకోన‌క్క‌ర్లేదు.

వైస్రాయ్ కుట్ర విజ‌య‌వంతం కావ‌డం, ఎన్టీఆర్‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దించేయ‌డం, ఆ స్థానంలో చంద్ర‌బాబు నాయుడు ఆసీనులు కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. విచిత్రం ఏమిటంటే- తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు అయితే.. పార్టీ చీల్చిన చంద్ర‌బాబు నాయుడిదే అస‌లు టీడీపీ అని న్యాయ‌స్థానాలు కూడా గుర్తించ‌డం. చంద్ర‌బాబు చేసిన మోసాన్ని, వెన్నుపోటు రాజ‌కీయాన్ని త‌ట్టుకునే శ‌క్తి లేక‌, ఎన్టీ రామారావు గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌ర‌ణించిన త‌రువాత ఎన్టీఆర్ ఫొటోకు దండేసి, దండం పెట్టి, ఆయ‌న ఓ మ‌హానుభావుడిగా కీర్తించ‌డం చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ వంతు అయింది. ఎన్టీఆర్ చివ‌రి రోజులు అత్యంత దుర్భ‌రంగా గ‌డిచాయి.

ఈ విష‌యాన్నింటినీ రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`లో చ‌ర్చకు పెట్టారట‌. య‌ధాత‌థంగా తెర‌కెక్కించారట‌. రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాలు మొర‌టుగా ఉంటాయి. ఏ మాత్రం భావుక‌త్వానికి, సున్నిత‌త్వానికి చోటు ఉండ‌దు. పాట‌ల్లోనూ ర‌క్తపాతాన్ని క‌థ‌కు అనుగుణంగా చూపించ‌డంలో ఆర్జీవీ దిట్ట‌. అలాంటి ద‌ర్శ‌కుడి చేతిలో నుంచి ఎన్టీఆర్ తాను అనుభ‌వించిన చివ‌రి రోజుల క‌థాంశంతో కూడిన సినిమా వ‌స్తుండ‌టం చంద్ర‌బాబు భ‌జ‌న ప‌రులను ఆందోళ‌న‌లోకి నెట్టేస్తోంది.

ఇప్ప‌టికే- ఈ సినిమాలోని రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. `వెన్నుపోటు` పాటపై తెలుగుదేశం నాయ‌కులు, ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు పోలీస్‌స్టేష‌న్‌లో కేసు కూడా పెట్టారు. ఆ పాట‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఒక్క పాట‌కే వారు ఇంత‌లా ఉలిక్కి ప‌డితే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వైస్రాయ్ హోట‌ల్ కుట్ర‌, ఎన్టీఆర్ చివ‌రి రోజుల‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌చ్చిగా చిత్రీక‌రించార‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

బాల‌కృష్ణ ఎన్టీఆర్ ఓట‌ర్ల‌ను ఏ మేర‌కు ప్ర‌భావతం చేస్తుందనేది ప‌క్క‌న పెడితే.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఖ‌చ్చితంగా తెలుగుదేశం పార్టీకి మైన‌స్ పాయింట్ అవుతుంది. త‌ట‌స్థ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితుల‌ను చేస్తుంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను తీవ్ర‌త‌ను పెంచ‌డానికి ఆస్కారం ఏర్ప‌డుతుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీయాల‌నే ఆలోచ‌న రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఎంత మాత్ర‌మూ లేదు. బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం, అది వెంట‌నే సెట్స్‌పైకి వెళ్ల‌డం, ఎన్టీఆర్‌ను ఒక కోణంలోనే చూపించేలా క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డం రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు న‌చ్చ‌లేదు.

ఎన్టీఆర్ జీవితంలో ఆయ‌న చివ‌రిరోజులు సినిమాలో చూప‌క‌పోతే అది బ‌యోపిక్ ఎలా అవుతుందంటూ ఆర్జీవీ అభిప్రాయ ప‌డ్డారు. అందుకే- ఆ సినిమా ముగిసిన పాయింట్ వ‌ద్దే త‌న సినిమా క‌థ ఆరంభం అవుతుంద‌నీ చెప్పారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న క‌థ‌ను అల్లుకున్నారు. సినిమాలోని స్ట‌ఫ్ ఎలాంటిదో ఫ‌స్ట్ లుక్‌లోనే చూపించేశారు.

ఓ ఇంట్లో చీక‌ట్లో, నిరాశా నిస్పృహ‌ల‌తో కూర్చిలో ఎన్టీఆర్ కూర్చుని ఉండ‌గా.. చెప్పుల‌ను గుమ్మం బ‌య‌టే వ‌దిలేసి, కుడికాలిని ముందు పెట్టి అదే ఇంట్లో ఓ మ‌హిళ ప్ర‌వేశిస్తున్న ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టి తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో గుండెల్లో బాంబుల‌ను పేల్చింది. `వెన్నుపోటు` పాట కూడా వారి భ‌యానికి త‌గ్గట్టుగా, ఆందోళ‌న‌ల‌కు అనుగుణంగా కొన‌సాగింది. వెన్నుపోటు పాట‌లో వాడిన విజువ‌ల్స్ భ‌లేగా కుదిరాయ‌ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. ఇవ‌న్నీ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచాయి. ఈ నెల 24వ తేదీన ఈ మూవీ విడుద‌ల కానుంది.