ఇది బీజేపీ – బీఆరెస్స్ ల సీఎంపీ… రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ వైరల్!

మరో ఆరు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారాలకు తెరపడనుంది. ఈ సమయంలో తెలంగాణలో ప్రచారాలు ఊపందుకోవడం ఒకెత్తు అయితే… ఊహించని రీతిలో పలువురు నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లు ఫైరవుతున్నారు. బీఆరెస్స్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని విమర్శిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఓక్ బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో భాగంగా… బీజేపీ – బీఆరెస్స్ లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ఇది ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన కామన్‌ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ).. ఇది ప్రజలు గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని ఆయన బహిరంగ లేఖలో కోరారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.

రేవంత్ లేఖ సాగిందిలా… “బీజేపీ – బీఆరెస్స్ లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్ని మోడీ, కేసీఆర్‌ లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో చేరిన వాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?” అని ప్రశ్నించారు.

అనంతరం… “అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు.. ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆరెస్స్ ల మధ్య కుదిరిన కామన్‌ మినిమం ప్రోగ్రాం” అని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఇదే సమయంలో… “తెలంగాణలో కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి? గడచిన పదేళ్లలో మోడీ – షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి” అని లేఖలో కోరారు రేవంత్‌.

ఇక ఫైనల్ గా… “మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! నేను బీజేపీ – బీఆరెస్స్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు” అని రేవంత్‌ రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు.