రేవంత్ రెడ్డి ‘ఆపరేషన్ స్వగృహ’ పథకం.!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చింది.! కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకున్న దరిమిలా, త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందనే నమ్మకం పెరుగుతోంది రేవంత్ రెడ్డికి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని వివిధ కారణాలతో వీడి వెళ్ళిన నాయకులంతా, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. ‘నాతో మీకు ఏమైనా విభేదాలుంటే.. వాటిని పరిష్కరించుకుందాం.. పార్టీని బాగు చేసుకుందాం..’ అని పిలుపునిస్తున్నారు రేవంత్ రెడ్డి.

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, కాస్తో కూస్తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇలా వుందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి మాత్రమే. ఇంకెవరికీ బాధ్యత లేదు. కథలు చెప్పే నాయకులంతా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి బయటకు వెళ్ళిపోయినోళ్ళే. సరే, అది కాంగ్రెస్ పార్టీ రాజకీయం. అదలాగే వుంటుంది.

ఇంతకీ, రేవంత్ రెడ్డి కూడా స్వగృహ పథకానికి అప్లయ్ చేసుకుంటేనో.! అంటే, తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళ్ళిపోతేనో.? ఏమాత్రం టీడీపీ తెలంగాణలో పుంజుకుంటుందనే డౌటానుమానం రేవంత్ రెడ్డికి వచ్చినా, ఆయన క్షణం కూడా ఆలోచించరు. కాంగ్రెస్ పార్టీలో వున్నా, రేవంత్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ చంద్రబాబు మీదనే.!