పురాణాలలో శ్రీరాముడు ఎంత ప్రసిద్ధుడో, రావణుడు కూడా అంతే ప్రసిద్ధుడు. ప్రహ్లాదుడు ఎంత ప్రముఖుడో హిరణ్యకశిపుడు కూడా అంతే ప్రముఖుడు. కాకపొతే ఒకరు మంచి కార్యాలతో ప్రసిద్ధులు అయితే మరొకరు చెడుపనులతో ప్రముఖులు అయ్యారు. తెలంగాణ లోని మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడుగా గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన ఎనుముల రేవంత్ రెడ్డి కూడా తాను చేసిన మంచిపనులకన్నా, వ్యతిరేక ప్రచారం వల్లనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రాజకీయజీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించాడు. ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా (స్వతంత్రుడిగా గెలిచినప్పటికీ, తరువాత టిడిపిలో చేరారు) గెలిచారు. కొడంగల్ నియోజకవర్గం అంటే రేవంత్ రెడ్డి అన్నంతగా ఆయన ప్రఖ్యాతులు అయ్యారు.
అన్నీ అవలక్షణాలు ఉన్నాయి
ఆయనలో ఒక రాజకీయనాయకుడుకు ఉండాల్సిన చురుకుదనం, గరుకుతనం ఉన్నప్పటికీ, అనేక సంఘవ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రౌడీయిజం, గూండాయిజం ఆయనకు కవచకుండలాలు అని చెప్పుకుంటారు. అనేకసార్లు ఆ సంగతి కూడా రుజువైయింది. ఆ మధ్య పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందిన నయీమ్ తో రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. భూముల కబ్జాలు, భూముల ఆక్రమణల ఆరోపణలకైతే అంతే లేదు. మొన్న కీసర ఎమ్మార్వో నాగరాజు కోటి పదిలక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన కేసులో కూడా రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం ఆ లక్షణాలను సాహసోపేతంగా భావిస్తారు. తెలంగాణాలో లెక్కలేనంతమంది అభిమానులను కలిగి ఉన్న అతి కొద్దిమంది నాయకులలో రేవంత్ రెడ్డి ఒకరు అని చెప్పడానికి సందేహం అవసరం లేదు.
తెలంగాణ ద్రోహిగా ముద్ర
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆరెస్ ఉద్యమం చేస్తుంటే ఆయన సమైక్యవాదాన్ని వినిపించి తెలంగాణ ద్రోహిగా నిందలు పడాల్సివచ్చింది. ఆయన సమీపబంధువు జైపాల్ రెడ్డి సమైక్యవాది అని చెప్పుకుంటారు. ఆయన అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి కూడా నడిచాడు. తెలంగాణ వ్యతిరేకిగా పేరుపడిన చంద్రబాబు నాయుడు సాహచర్యాన్ని వీడలేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా ఆయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఒక సందర్భంలో తెలంగాణ వాదుల మీద తుపాకీ ఎత్తినవాడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ, ఆయన అనుచరులు ఆయన్ను ఆరాధనాభావంతోనే గౌరవిస్తారు.
కేసీఆర్ కు కొరకరాని కొయ్య
ప్రత్యేకతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు, మీడియా మొత్తం నిర్వీర్యం అయిపోయాయి. కేసీఆర్ పాలనకు జేజేలు పలుకుతూ రెండోసారి కూడా కేసీఆర్ ను పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పట్ల తన విద్వేషపూరిత వైఖరిని మార్చుకోలేదు. కేసీఆర్ మీద తొడగొట్టడం ఆపలేదు. ఇవాళ తెలంగాణాలో కేసీఆర్ కు పక్కలోబల్లెం లాగా వ్యవహరిస్తున్న ఒకేఒక్క రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. టీఆరెస్ నాయకులు, అభిమానులు రేవంత్ రెడ్డిని ఎంతగా దుమ్మెత్తిపోసినా, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ మాత్రం కేసీఆర్ అంటే నిప్పులు కక్కుతూనే ఉన్నారు.
రాజకీయ జీవితంలో చీకటి రోజు
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ దాదాపు చచ్చిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో తెలంగాణాలో పార్టీని బతికించే నాయకుడు లేకుండా పోయాడు. ఆ సందర్భంలోరేవంత్ రెడ్డిని తెలంగాణ టిడిపి అధ్యక్షుడుగా చెయ్యాలని చంద్రబాబు ఆలోచించారు. అయితే అంతలోనే ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనయింది. తెలంగాణ కౌన్సిల్ లోని ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడి ఓటును అయిదు కోట్ల రూపాయలకు బేరమాడుతూ, యాభై లక్షల రూపాయల అడ్వాన్స్ అందిస్తూ అవినీతి నిరోధక శాఖవారు పన్నిన ఉచ్చులో ససాక్ష్యంగా దొరికిపోవడంతో రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురయింది. రేవంత్ రెడ్డిని ఎసిబి అరెస్ట్ చేసింది. నెలరోజుల పాటు రిమాండ్ ఖైదీగా గడిపారు. జైల్లో ఉంటూనే కుమార్తె పెళ్ళికి తండ్రిగా పాల్గొనాల్సివచ్చింది! నిజానికి ఆ కేసుతో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం అంతమైపోతుందని చాలామంది నమ్మారు. ఎందుకంటే ఆ కేసు వల్లనే చంద్రబాబు పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకుని అమరావతికి పారిపోయారు. తెలుగుదేశం పార్టీ ఉనికి ఆరోజుతోనే భూస్థాపితమై పోయింది. ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగితే కేసీఆర్ వదిలిపెట్టరని భావించారో ఏమో తెలియదు కానీ, చంద్రబాబు సలహా మేరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యం. ఏ అదృశ్యశక్తులు కాపాడాయో తెలియదు కానీ, రేవంత్ రెడ్డి మళ్ళీ పుంజుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఆరు నెలలు తిరగకముందే ఏకంగా ఎంపీగా ఎన్నికయ్యారు.
పిసిసి అధ్యక్షుడు అవుతాడా?
రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీలోనే గడిపి, కేవలం కేసులకు భయపడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అంటే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఎవ్వరికీ సరిపడదు. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ సేవలోనే గడిపిన వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, వివేకా సోదరులు రేవంత్ రెడ్డి చేరికను ఏమాత్రం సహించలేకపోతున్నారు. సోనియా, రాహుల్ గాంధీలకు స్వల్పకాలంలోనే రేవంత్ రెడ్డి సన్నిహితులు కావడాన్ని ఆ నాయకులు భరించలేకపోతున్నారు. దానికితోడు పిసిసి అధ్యక్ష పదవినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి రేవంత్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్ శ్రేణులలో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ప్రజల్లో విస్తారమైన పలుకుబడి, పదిమందిని పోగేయగల సమర్ధత కలిగిన వారు శూన్యం.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలను ప్రభావితం చెయ్యగలిన నాయకులు ఒక్కరు కూడా లేరు. పైగా వారంతా కేసీఆర్ అంటే భయభక్తులు, గౌరవాన్ని ప్రదర్శిస్తూ పార్టీని ఎదగకుండా చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. అంతే కాకుండా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పందొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ వారిలో డజను మంది అధికారపార్టీలో చేరిపోవడం, కొందరు మంత్రి పదవులు కూడా చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. వారిని పార్టీ మారకుండా నిరోధించడంలో ప్రస్తుత నాయకత్వం విఫలం అయిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారపార్టీ మీద తీవ్ర విమర్శలు చెయ్యడంలో, కేసీఆర్ ను ఎదిరించడంలో తెగువను ప్రదర్శించే నాయకుడిగా ముద్ర పడిన రేవంత్ రెడ్డిని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పిసిసి అధ్యక్షుడిగా చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు అండ కూడా ఉంటుంది. చంద్రబాబు అండ ఉంటే వారిని ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా ఏమీ చెయ్యలేదని ఇప్పటికే అనేకమార్లు రుజువయింది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక విషయంలో మళ్ళీ రుజువయింది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు