తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఓ కారణమైతే, ఇంకో కారణం.. రేవంత్ రెడ్డి.! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు లేకపోలేదు. వాటికి కారణం స్వయానా రేవంత్ రెడ్డే. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి కారణం కూడా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డే.
రేప్పొద్దున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైపోయినా దానికి రేవంత్ రెడ్డే కారకుడవుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి అన్నీ తానే అయి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు కనిపించగానే, అంతకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళిన నేతలంతా, తిరిగొచ్చేశారు కాంగ్రెస్‌లోకి.
ఇక, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని కూడా దాదాపు రేవంత్ రెడ్డే ఫిల్టర్ చేశారు. ఆయన కనుసన్నల్లోనే అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఎన్నికల్లో ఖర్చు బాగా చేయగలిగే నాయకుల్ని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. ఆ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వుంటుంది.
ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. మరో వైపు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్నే అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎన్టీయార్ విషయంలోనూ, వైఎస్సార్ విషయంలోనూ, చంద్రబాబు విషయంలోనూ రేవంత్ రెడ్డి ఒక్కోసారి ఒక్కోలా చేస్తున్న వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలచనైపోతోంది.
కేసీయార్ మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యల సంగతి సరే సరి. నిలకడలేని రాజకీయంతో రేవంత్ రెడ్డి ఏనాడో ‘రవ్వంతరెడ్డి’ అనిపించేసుకున్నారు. అంతేనా, ‘రేటెంత రెడ్డి’ అనే విమర్శల్నీ ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుని, అధికార పీఠమెక్కినా.. ఆ వెంటనే రేవంత్ రెడ్డిని పక్కకు తోసే ప్రణాళికలు సీనియర్ల నుంచి షురూ అయిపోయాయ్.! రేవంత్ మాత్రం, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేది తానేనని తెగేసి చెబుతున్నారు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అందునా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. అస్సలు అంచనాలకు అందవ్.!