ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన చర్చ తీవ్రంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఈ విషయంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొత్త విశ్లేషణ చేశారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది కేవలం బీజేపీ – బీఆరెస్స్ లు కలిపి ఆడుతున్న డ్రామాలని, దోచుకున్న సొమ్ము పంచుకునే క్రమంలో సమస్యలు వచ్చినదాని ఫలితమే ఈ కేసు అని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అవును.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
కవితను జైల్లో వేయడానికి ఇంత సేపా? అని వ్యాఖ్యానించారు. ఇందంతా బీజేపీ, బీఆరెస్స్ కలిసి ఆడుతున్న డ్రామాలని చెబుతున్న రేవంత్ రెడ్డి… కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని.. బీఆరెస్స్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని కొత్త చర్చకు తెరతీశారు.
ఈ విషయాలపై మరింత గట్టిగా మాట్లాడిన రేవంత్… హస్తిన కేంద్రంగా నడుస్తున్న డ్రామా అనేది… బీజేపీ – బీఆరెస్స్ ల ఉమ్మడి డ్రామా అని రేవంత్ చెబుతున్నారు. దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడా రావడం వల్ల మోదీ, కేసీఆర్ ఫ్యామిలీ మీద రివేంజ్ తీసుకుంటున్నాడు.. దొంగలు దొంగలు ఊర్లు దోచుకుని.. దోచుకున్న సొమ్ము పంచుకుంటున్న సమయంలో వచ్చిన సమస్య ఫలితమే కవితకు ఈడీ నోటీసులు అని అన్నారు.
కాగా… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఅరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. శనివారం ఉదయం 11:30 నుంచి రాత్రి 7.30 దాకా ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ లో పాత్ర గురించి, రూ.100 కోట్ల ముడుపుల గురించి ఆరా తీసింది. అయితే చాలా ప్రశ్నలకు కవిత పొంతన లేని సమాధానాలు చెప్పారని, దాట వేసే ధోరణి అవలంబించారని తెలుస్తుంది. దీంతో… ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని కవితను ఈడీ ఆదేశించింది.