బాబుకు ఆప్షన్స్ ఇస్తున్న రాయపాటి… కన్నాపై సంచలన వ్యాఖ్యలు!

ఒకప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించినవారిలో ఒకరైన రాయపాటి సాంబశివరావు… వయోభారమో లేక పరిస్థితులు కలిసిరాకో కొంతకాలంగా సైలంట్ గా ఉన్నారు. అయితే… ఈ క్రమంలో మరోసారి గుంటూరు జిల్లాలో తమ కుటుంబ సభ్యులు చక్రం తిప్పాలని.. కుదిరితే తనకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు సాంబశివరావు.

అవును… తాజాగా గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై స్పందించిన రాయపాటి సాంబశివరావు… చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే గతంలో తాను పోటీ చేయకపోవడానికి కారణం డబ్బులు లేకపోవడమే అని.. ఇప్పుడు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి… ఈసారి పోటీకి దిగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్కడితో ఆగని ఆయన… చంద్రబాబు ముందు ఫ్యామిలీ ప్యాకేజ్ డిమాండ్ ఒకటి పెట్టారు. తనకు నరసరావుపేట సీటు అడుగుతున్న రాయపాటి… తన కుమారుడు రంగబాబుకి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరుతూ… బాబు ముందు… సత్తెనపల్లి ఇస్తారా? పెదకూరపాడు ఇస్తారా? అంటూ రెండు ఆప్షన్లు ఉంచారు. ఇదే క్రమంలో… తన తమ్ముడు కూతురు రాయపాటి శైలజకూ కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు సాంబశివరావు. కాకపోతే… ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ లో చిన్న డిస్కౌంట్ కూడా బాబుకి ఇచ్చారు. అదేమిటంటే… తన కుమారుడికి, తన తమ్ముడి కూతురికీ టికెట్లు ఇస్తే… తనకు ఇవ్వకపోయినా పర్లేదని!

ఇక కొత్తగా పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ పై స్పందించిన రాయపాటి… కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా తామంతా సపోర్ట్ చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ… “కన్నాతో రాజీ లేదు.. ఏం లేదు.. పార్టీ కోసం పని చేస్తామంటున్నాను.. కన్నా లక్ష్మీనారాయణ నన్ను పదేళ్లు ఏడిపించాడు.. ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారు. చంద్రబాబునూ ఏడిపించాడు.. కొన్ని కారణాల వల్ల టీడీపీలో చేరాడు” అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రాయపాటి సాంబశివరావు.

దీంతో ప్రస్తుతం గుంటూరు టీడీపీ శ్రేణుల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి తన ముందుంచిన ఈ డిమాండ్లపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు? రాయపాటి ఫ్యామిలీకి ఎన్ని సీట్లిస్తారు? అన్నది వేచి చూడాలి!