తనపై అనర్హత వేటు వేసిన అనంతరం తాజాగా ప్రెస్ ముందుకు వచ్చారు కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ! ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ మాటల్లో… ఆవేశం, ఆవేదన, వ్యూహం స్పష్టంగా ధ్వనిస్తున్నాయని అంటున్నారు విశ్లెషకులు. ఇంతకూ రాహుల్ ప్రసంగం ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం!
అదానీ షెల్ కంపెనీల్లో 20వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారని తాను పార్లమెంటులో ప్రశ్నించడమే… నేటి పరిణామాలకు కారణం అని మొదలుపెట్టారు కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ. తాను ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నానని… ఆ ఇరవై వేల కోట్లు ఎవరివని ప్రశ్నించారు. తనపై వేటు వేసినా, జైల్లో పెట్టినా, ఆఖరికి కొట్టినా పర్లేదు.. కానీ ప్రధాని మోడీ ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చైనీయులు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన రాహుల్… మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అదానీతో సంబంధాలున్నాయని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించి అదానీకి ఎయిర్ పోర్టుల నిర్మాణ బాధ్యతలను కట్టబెట్టారని దుయ్యబట్టారు.
మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన ప్రసంగాలపై తప్పుడు ప్రచారం చేశారని మోడీ & కోలపై నిప్పులు చెరిగిన రాహుల్… లండన్ తన ప్రసంగంపై కేంద్ర మంత్రులు అబద్దాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోనూ అబద్దాలు మాట్లాడారని.. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరితే… స్పీకర్ నవ్వి.. మాట్లాడే అవకాశం రాదని తనతో చెప్పినట్లు వెల్లడించారు రాహుల్. ఇదే క్రమంలో… అదానీ వ్యవహారంలో పార్లమెంట్ కు తాను అన్ని సాక్ష్యాలు సమర్పించినందుకే లోక్ సభలో కావాలనే తన ప్రసంగాన్ని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్!
ఇదే క్రమంలో… దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని మండిపడిన రాహుల్ గాంధీ.. తనపై వేటే అందుకు నిదర్శనమని.. తాను దేనికి భయపడనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడం మాత్రం మానేది లేదని స్పష్టం చేశారు. ఇక, ఆరునూరైనా నూరు ఆరైనా… అదానీ వ్యవహారాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెబుతున్న రాహుల్… అనర్హత వేటు వేసినా – జైల్లో వేసినా – కొట్టినా కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
ఇక మోడీకి అదానికీ ఉన్న సంబంధంపై స్పందించిన రాహుల్… “ప్రధాని మోడీ దృష్టిలో దేశమంటే అదానీ – అదానీ అంటే దేశం” అని రాహుల్ విమర్శించారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన విపక్షాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపిన రాహుల్… మోడీకి భయం పట్టుకుందని, కంగారులో ఆయనే విపక్షాలకు ఆయుధం ఇచ్చారని తెలిపారు!