కారణాలేమైనా రెబెల్ గా మారి ఆరోపణలు,విమర్శలు,ఫిర్యాదులతో వైసిపికి చుక్కలు చూపిస్తున్న నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు సొంత పార్టీని మరో పోటు పొడిచారు. తనను ఘాటుగా హెచ్చరిస్తూ బాపట్ల ఎంపి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై రఘరామకృష్ణంరాజు లోక్ సభలో ప్రివిలేజ్ నోటీస్ దాఖలు చేశారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసిపిపై ఏ మాత్రం అవకాశం దొరికినా ఎదురుదాడి చేస్తున్న రఘురామ ఈసారి బాపట్ల ఎంపి నందిగం సురేష్ ను టార్గెట్ చేశారు. తద్వారా వైసిపి ప్రతిష్టని దెబ్బతీయాలనే పంతంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ రఘురామ ఏమని ఫిర్యాదు చేశారంటే? …
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు
వైసిపి బాపట్ల లోక్ సభ ఎంపి నందిగం సురేష్ మీడియా ముఖంగా తనను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని…అందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.
నందిగం సురేష్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను రఘురామకృష్ణంరాజు కోరారు. తనపై ఎంపి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యల తాలూకూ వీడియోను కూడా స్పీకర్‌కు అందజేశారు. ఎంపీగా ఉన్న తనను దారుణంగా కించ పరిచేలా ఎంపి నందిగం సురేష్ వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నందిగం ఏమన్నారంటే…
రెండు రోజుల క్రితం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు నుద్దేశించి బాపట్ల ఎంపి నందిగం సురేష్ మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి జగన్ గురించి పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కని కొట్టినట్లు కొడతామని హెచ్చరించారు.
తమ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎంపి మిథున్ రెడ్డికి నాలుగు ఓట్లు కూడా రావని రఘురామ అవహేళనగా మాట్లాడుతున్నారని, అయితే తమకు ఎన్ని ఓట్లు వస్తాయో పక్కనబెడితే ఢిల్లీలో ఛీటర్, గలీజు పనులు చేయడం వంటి పదవులకు పోటీ పడితే ఎంపీల ఓట్లన్నీ ఆయనకే పడతాయని సురేష్ వ్యాఖ్యానించారు.
చివరికి ఎవరిది పైచేయో?
రెబెల్ గా మారి సొంత పార్టీ పైనే తీవ్రమైన ఆరోపణలు, ఘాటైన విమర్శలతో పార్టీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్న నర్పాపురం ఎంపి రఘురామకృష్ణం రాజుపై ఇప్పటికే వైసిపి స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎలాగైనా అనర్హత వేటు వేయాలని పట్టుదలతో ఉన్న వైసిపి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ పని జరిగేలా చూడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అయితే బిజెపి అండ, సాంకేతికపరమైన అంశాలు తనకే తోడ్పడతాయని, వైసిపి తననేం చేయలేదనే ధీమాతో రెబెల్ రఘురామ ఉన్నారు. మరైతే ఈ విచిత్ర పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందనేది త్వరలోనే తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.