కేసీఆర్ కు కొత్తగా ఆర్. నారాయణమూర్తి టెన్షన్!

ప్రస్తుతం తెలంగాణలోని అధికార బీఆరెస్స్ కు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు అన్నీ కలిసి ప్రభుత్వాన్ని మాగ్జిమం ఇరుకునపెట్టేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్. నారాయణ మూర్తి రూపంలో తెలంగాణ సర్కార్ కు పెద్ద సమస్య ఎదురుకాబోతుంది!

అవును… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపున్న ఆర్. నారాయణమూర్తికి… తెలంగాణ సమాజంలో అంతకుమించిన ప్రత్యేక గౌరవమే ఉంది. తన సినిమాల్లో తెలంగాణ సమాజంలోని సమస్యలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు ఆర్. నారాయణ మూర్తి. ఈ నేపథ్యంలో… ఆయన తాజా చిత్రం.. “యూనివర్శిటీ” త్వరలో విడుదల కాబోతుంది.

ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులే ప్రధానాంశంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సందర్భంగా స్పందించిన ఆర్.నారాయణ మూర్తి… 10వ తరగతి పేపరు లీకేజీలు.. గ్రూపు 1,2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు.. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే క్రమంలో… “లంబ కోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే… రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే… ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?.. కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి” అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ” అని స్పష్టం చేశారు.

దీంతో… ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి పెను సమస్యగా మారిన పదోతరగతి, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ సమస్యను ఈ “యూనివర్శిటీ” చిత్రం మరింత హీటెక్కించబోతుందని.. ఫలితంగా కేసీఆర్ కు పెను సమస్యగా పరిణమించబోతుందని అంటున్నారు విశ్లేషకులు!

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వ వహిస్తూ నటించిన తాజా చిత్రం “యూనివర్సిటీ” మంగళవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి.. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు!