Polavaram: పోలవరానికి మోదీ పర్యవేక్షణ: ఇన్నాళ్ళకు పవర్ఫుల్ ఫోకస్!

వర్షాలు సమీపిస్తున్నా సమయంలో, పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకోవాల్సిన సమయం ఇదే. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షకు సిద్ధమవుతుండటం ప్రాజెక్టు భవిష్యత్తుకు కీలక మలుపు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం పనుల్లో ఇన్నాళ్లుగా నెలకొన్న విభిన్న రాష్ట్రాల అభ్యంతరాలు, రాజకీయం చివరికి మోదీ దృష్టిలోకి రావడం వెనుక పెద్ద ప్రయోజనమే దాగుంది. ప్రత్యేకంగా ప్రధాని కార్యాలయం నుంచే ఈ సమీక్ష పిలవడం కేంద్రం ప్రాధాన్యతను సూచిస్తుంది.

ఈ నెల 28న జరగనున్న సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖ అధికారులు హాజరవుతారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి గతంలో వచ్చిన న్యాయపరమైన, భౌగోళికమైన అభ్యంతరాలను కేంద్రం ఈ సమీక్షతో తీరుస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా అభ్యంతరాల వల్ల అనేక అడ్డంకులు ఎదురైన తరుణంలో.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా కేంద్రం తుది స్పష్టతకు సిద్ధమవుతోంది.

చంద్రబాబు నేతృత్వంలో ప్రాజెక్టు తిరిగి పునరుజ్జీవనం పొందుతున్న వేళ, మోదీ సమీక్ష ప్రాజెక్టుకు చక్కటి మద్దతుగా నిలవనుంది. గతంలో ఈ నిర్మాణ బాధ్యత రాష్ట్రం తీసుకున్నా, నిధులు మాత్రం కేంద్రం సమకూర్చిన తీరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మళ్లీ పనులు మొదలవుతున్న వేళ, ప్రధాని స్వయంగా వ్యవహరించడమే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలతోనూ పరిష్కారం చూపే దిశగా సాగడం ఏపీకి మేలు చేసే పరిణామమే అని చెప్పాలి.