Narendra Modi: మన్ కీ బాత్.. తెలుగు హీరోపై మోదీ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈసారి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు సినీరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అక్కినేని సినిమాలు భారతీయ సంప్రదాయాలను, విలువలను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాయని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు ఎన్టీఆర్, అక్కినేని వంటి లెజెండ్స్ చేసిన కృషిని ప్రశంసించారు.

ప్రధాని మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, భారతీయ చలనచిత్ర రంగం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. తొలిసారి మన దేశంలో నిర్వహించనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా, వినోద రంగ ప్రముఖులు పాల్గొననున్నారని చెప్పారు. ఈ సమ్మిట్ భారతీయ సినిమాలకు గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తుందన్నారు.

సినీరంగానికి చెందిన ఇతర దిగ్గజాల గురించి కూడా మోదీ ప్రసంగంలో ప్రస్తావించారు. బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా చిత్రాలు సమాజానికి పలు మార్గదర్శకాలు చూపించాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతీయ చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా చేశారని కొనియాడారు. భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు.

మోదీ తన ప్రసంగంలో సినిమాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబం అంటూ కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించడం గర్వకారణమన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.