దుబ్బాకను గెలిపించిన వారికే పీసీసీ చీఫ్

మొత్తం మీద దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీలో పోటీని పెంచింది. పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్న నేతలంతా దుబ్బాక ఉపఎన్నికల్లో చెమటోడుస్తున్నారు. పార్టీ హై కమాండ్ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు. అయితే ఈ పోటీ కాస్త ఎక్కవ అవడంతో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతల పరిస్థితి చావో రేవో అన్నట్లుగా తయారైంది. పార్టీ అధిష్టానం దుబ్బాకపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో నేతలంతా దుబ్బాకలో వాలిపోయారు. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కేసీఆర్ తో పాటు అధికార పార్టీపై విమర్శల దాడి పెంచడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా దైర్యం కూడేసుకొని మరీ కేసీఆర్ ను తిట్టిపోస్తున్నారు. కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పడుతున్న పోటీ అంతా ఇంతా కాదని టాక్ జరుగుతోంది.

దుబ్బాక ఉపఎన్నికను తమ పొలిటికల్ కెరీర్ కు అనుకూలంగా మార్చుకునేందుకు పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు దుబ్బాకలో తెగ హడావిడి చేస్తున్నారు. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి దుబ్బాకలో గెల్చి పరువుకాపాడుకోవాల్సిందే అని పార్టీ అధిష్టానం సీరియస్ గానే తేల్చి చెప్పేసిందట. దీంతో ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా వ్యక్తిగతంగా దుబ్బాక ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి మరింత పెరుగిపోతోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఫ్యూహంతో బరిలోకి దిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీలు ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డిలు జోరు పెంచి సమరానికి సై అంటున్నారు. ఈ నేతలకు దుబ్బాక నియోజకవర్గంలో ఒక్కో మండలాన్ని అప్పగించింది హైకమాండ్. వీరికి అప్పగించిన మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెచ్చే బాధ్యతను వీరికే అప్పగించింది. దీంతో పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తం కుమార్ రెడ్డి మిగతా వారి కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఈయనకు హైకమాండ్ నుంచి గట్టిగానే వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాకలోనే మాకం వేసి మరీ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఈ నేతల మధ్య పోటీతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిపోయింది.

అందుకే గత ఉపఎన్నికలతో పోల్చితే ఈసారి దుబ్బాకలో కాంగ్రెస్ ఎక్కువ పోటీని ఇస్తోంది. కిందటి ఎన్నికల్లో అప్పటి మిత్ర పక్షం జన సమితికీ ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో కాంగ్రెస్ క్యాడర్ పార్టీకి దూరమైంది. దీంతో ఈ క్యాడర్ ను అంతా పోగు చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. నేతల రాకతో జోష్ పెరిగి క్యాడర్ కూడా పార్టీకి మళ్లీ దగ్గరవుతున్నారు.

ఇక పీసీసీ చీఫ్ అయితే మిగతా నేతల్లా కాకుండా ఏకంగా దుబ్బాకలోనే మకాం పెట్టేశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి సైతం ఏఐసీసీ నేతల దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఈ ఉపఎన్నికను అవకాశంగా మాల్చుకుంటున్నారు. అందుకే అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఉపఎన్నికల్లో ఆయనకు ఓ మండల బాధ్యతను అప్పగించడంతో నిత్యం సదరు మండలంలో తిరుగూతూ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. తన క్యాడర్ ను కూడా దుబ్బాకకు రప్పించి ప్రచారం చేస్తున్నారు.

ఈ ఉప ఎన్నిక కారణంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా కూడా యాక్టివ్ అయ్యారు. ఏఐసీసీ పెద్దలను ఆకర్శించేందుకు ఈ ఉపఎన్నికను సదవకాశంగా మల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ముత్యం శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీనుంచి బయటకు రప్పించి కాంగ్రెస్ పార్టీలో చేర్చడంతో దామోదర రాజనర్సింహా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో మిగతా వారితో పోల్చితే ఈయనే అధిష్టానం వద్ద ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు సమాచారం. ఇక తనకు అప్పగించిన మండలంలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు తీసుకొస్తానని కోమటి రెడ్డి సవాల్ విసిరారు. ఇదే గనక జరిగితే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మిగతా వాళ్లతో పోల్చితే ఈయనే ఎక్కువ మార్కులు కొట్టేస్తారని టాక్ నడుస్తోంది.

మొత్తం మీద పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్న ఈ సీనియర్ నేతలు దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన ముత్యం శ్రీనివాస్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడుతున్నారాని టాక్ . చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ నేతల ఫ్యూహాలన్నీ ఫలిస్తాయో లేక టీఆర్ఎస్ పార్టీ బలం, బలగం ముందు కొట్టుకుపోతాయో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.