జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా టూర్ పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. మంత్రుల్ని పట్టుకుని బోడి లింగాలు.. అని జనసేన అధినేత వ్యాఖ్యానించడం అంత సబబుగా అన్పించదు ఎవరికైనాసరే. కానీ, ‘పవన్ కళ్యాణ్ నిజమే మాట్లాడి వుంటారు..’ అని సాక్షాత్తూ ఆయా మంత్రుల నియోజకవర్గాల్లోని ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి వచ్చింది. కారణం, పవన్ కళ్యాణ్.. మంత్రుల మీద ఆ స్థాయిలో విరుచుకుపడింది, ఆయా నియోజకవర్గాల్లో రోడ్ల దుస్థితిని చూసి.. రైతుల ఆవేదన చూసి. ఓ రాజకీయ పార్టీగా జనసేన పార్టీ, ఆయా అంశాలపై స్పందించడాన్ని తప్పు పట్టలేం. అలాగని, పవన్ కళ్యాణ్ చేసిన ‘అతి’ వ్యాఖ్యల్నీ సమర్థించలేం. కానీ, పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడి చేయడంలో సక్సెస్ అయిన సోకాల్డ్ మంత్రులు, తమ నియోజకవర్గాల్లో రోడ్ల దుస్థితిపై ఇప్పటికీ స్పందించకపోవడమే ఆశ్చర్యకరం.
‘ఒక్కటంటే ఒక్క గోతిని కూడా పూడ్చలేకపోయారు.. వీళ్ళకి పవన్ కళ్యాణే కరెక్ట్..’ అనే చర్చ ఇప్పుడు జన బాహుళ్యంలో కనిపిస్తోంది. వేల కోట్లు రైతుల కోసం ఖర్చు పెబుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.. పబ్లిసిటీ చేసుకుంటోంది కూడా. కానీ, ఎక్కడ.? రైతుల కష్టాలు ఎందుకు ఆ వేల కోట్లతో తీరడంలేదు.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వైసీపీలో ఎవరూ ముందుకు రావడంలేదు. రోడ్ల దుస్థితి విషయానికొస్తే, రాష్ట్ర చరిత్రలోనే ఏనాడూ లేనంత దారుణంగా వుంది పరిస్థితి. కానీ, ఎక్కడా రోడ్లను బాగు చేసే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు లేదు. సాక్షాత్తూ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఇలా వుంటే, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇంకెలా వుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు మామూలే. అధికార పార్టీ చేస్తుంది, విపక్షాలు చేస్తాయి. కానీ, ఎవరు ఏం మాట్లాడినా, ఏం చేసినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో.. ప్రజలకు న్యాయం చేయలేని దుస్థితిలో మంత్రులు వుంటే, అది ఖచ్చితంగా అధికార పార్టీకి మైనస్సే అవుతుంది. ‘మా నియోజకవర్గంలో రైతులకు కష్టాల్లేవు.. మా నియోజకవర్గాల్లో రోడ్లకు గుంతల్లేవు..’ అని చెప్పేందుకు ఏ మంత్రి అయినా సాహసించగలరా.?