పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్సా.? ఫెయిల్యూరా.?

Pawan Kalyan
గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళడంపై రాజకీయ వర్గాల్లో చాలా ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ – జనసేన మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌, ఈ క్రమంలో బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కి ఢిల్లీకి వెళ్ళాల్సిందిగా సూచించడం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనానిని ఢిల్లీకి ఆహ్వానించడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, ఢిల్లీ వెళ్ళిన రెండ్రోజులకీ అక్కడ ‘సౌండింగ్‌’ లేకపోవడంతో పలు అనుమానాలు వినిపించాయి.. సోషల్‌ మీడియాలో చాలా కామెంట్లు చక్కర్లు కొట్టాయి.
 
Pawan Kalyan's Delhi tour
Pawan Kalyan’s Delhi tour

గ్రేటర్‌ ఎన్నికల కోసమో, తిరుపతి ఉప ఎన్నిక కోసమో కాదట..

జేపీ నడ్డా పిలుపు మేరకే ఢిల్లీకి వచ్చినట్లు, జేపీ నడ్డాతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కీలక అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి ‘స్పష్టత’ కోసం జనసేన అధినేత పవన్‌ ఢిల్లీకి వెళ్ళినట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. అయితే, జనసేనాని ఆశించిన స్పష్టత జేపీ నడ్డా నుంచి వచ్చిందా.? లేదా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

జేపీ నడ్డా మీడియా ముందుకు రాలేదేం?

పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ మాత్రమే మీడియా ముందుకొచ్చారు జేపీ నడ్డాని కలిసిన అనంతరం. జేపీ నడ్డాగానీ, బీజేపీకి చెందిన కీలక నేతలెవరూగానీ, జనసేనానితో కలిసి మీడియా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో జనసేనానికి బీజేపీ పెద్దల నుంచి తగిన గౌరవం లభించలేదా.? అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై జనసైనికుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికపై అదే సస్పెన్స్‌

తిరుపతి ఉప ఎన్నికలో నిలబడేది బీజేపీ అభ్యర్థా.? జనసేన అభ్యర్థా.? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు. కొద్ది రోజుల్లోనే అన్ని వివరాలూ తెలుస్తాయి.. అని జనసేనాని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్లో కొంత నైరాశ్యం కనిపించిందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఏపీ బీజేపీ నేతల్లో ఏ ఒక్కరూ జనసేనాని ఢిల్లీ టూర్‌లో కనిపించకపోవడం చూస్తోంటే, జనసేనాని ఢిల్లీ పర్యటన అంత సజావుగా సాగినట్లు కనిపించడంలేదు. ‘కొందరు పెద్దల్ని కలిశాం’ అని జనసేనాని చెప్పారుగానీ, వారెవరన్నదీ వెలుగులోకి రాలేదు.