‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకే ఢిల్లీకి వచ్చాం..’ అని గ్రేటర్ ఎన్నికల సమయంలో ఢిల్లీలో పడిగాపులు కాసి, ఎలాగోలా నడ్డాతో భేటీ అయ్యాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎటూ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు హైద్రాబాద్‌కి వచ్చారు గనుక, ఆ సమయంలోనే మిత్రపక్షం జనసేనతో భేటీ అయి వుండాల్సింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇంకోసారి ఢిల్లీ నుంచి జనసేన అధినేతకు పిలుపు వచ్చిందనే ప్రచారం జరగుతున్న దరిమిలా, ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం కాకుండా వుంటాయా.? జనసేన పార్టీ అయితే ఇప్పటివరకు, తమ అధినేతకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంపై స్పందించలేదు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక వ్యవహారంపై ఇరు పార్టీల మధ్యా కొంత అయోమయం వుంది. తమ పార్టీ తరఫున ముగ్గురు నలుగురు అభ్యర్థులున్నారని జనసేన చెబుతోంటే, తామే ఎన్నికల బరిలో వుంటామని బీజేపీ చెబుతోంది. ‘జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీలో వుంటారు..’ అని ఈ మధ్యనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. అయితే, ‘కలిసి చర్చించుకుంటున్నాం.. ఇంకా ఏదీ ఖరారు కాలేదు..’ అని జనసేన కుండబద్దలుగొట్టేస్తోంది. ఈ గందరగోళం నడుమ, క్లారిటీ కోసమే పవన్, ఢిల్లీకి వెళ్ళబోతున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అయితే, ఈసారి తమ అధినేతకు ఢిల్లీలో ఎలాంటి ‘గౌరవం’ దక్కుతుందోనన్న సందేహం జనసేన శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొంతకాలంగా ప్రధానితో అపాయింట్‌మెంట్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారనీ, అది ఖరారైతే.. తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రధానిని పవన్ కలుస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఏమో, ఈ ప్రచారాల్లో నిజమెంత.? అనే విషయాన్ని పక్కన పెడితే, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి వెన్నుపోటుకు గురైన జనసేన అధినేత, మళ్ళీ అలాంటి సమస్యనే ఇంకోసారి తిరుపతి ఉప ఎన్నికల్లో తెచ్చుకుంటారా.? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఏదో ఒక విషయం ముందే తేల్చేయాలనీ, చివరి నిమిషంలో చేతులెత్తేస్తే పరువు పోతుందని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా అధినేతను అభ్యర్థిస్తున్నారు.