‘జనసేన’ సిద్దాంతానికే గండికొట్టిన పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan
 
‘జనసేన’ ఆవిర్భావించిన రోజు నుండి ఈరోజు వరకు పవన్ నోట వినిపించిన సిద్దాంతం ‘ప్రశ్నించడం’.  అధికారం కోసం కాదు ప్రజల తరపున ప్రశ్నించి ప్రభుత్వంచేత పనులు చేయించడమే తన ప్రధాన లక్ష్యం అంటూ కొన్ని వేలసార్లు చెబుతూ వచ్చిన పవన్ ఈరోజు ఆ సిద్దాంతానికే స్వయంగా గండికొట్టారు.  ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి బాధితులు నిరసన తెలిపే సమయానికి పవన్ జనసేన శ్రేణులెవరూ నిరసనల్లో, ఆందోళనల్లో పాల్గొనవద్దని, కేవలం సహాయక చర్యలు మాత్రమే చేపట్టమని పిలుపునిచ్చారు.  దీంతో జనసైనికులు సైలెంట్ అయిపోయారు.  
 
ఆపద సమయంలో ఒత్తిడి దేనికి సహకారం అందివ్వాలి కానీ అనేది పవన్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ చెప్పిన కారణం. ఒక వ్యక్తిగా పవన్ చెప్పే ఈ కారణం సమంజసమే అయినా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా, అదీ ప్రశ్నించడమే ప్రధాన పాలసీగా పెట్టుకున్న నాయకుడిగా సరైన నిర్ణయం కానేకాదు.  సహాయక చర్యలతో పాటు నిరసన కార్యక్రమం కూడా చేపట్టాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే నిరసన తెలపనిదే న్యాయం జరగదు.  ఇప్పుడు వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయల సత్వర పరిహారం కూడా ప్రజలు, పలు యూనియన్లు, వామపక్షాల ఆందోళనల ప్రారంభం పుణ్యమే.  
 
కానీ పవన్ మాత్రం ఏకంగా పార్టీ పాలసీనే పక్కనబెట్టి సైలెంట్ అయిపోయారు.  న్యాయం కోసం ఎంతటి విపత్కర సమయంలో అయినా నిరసనకు దిగొచ్చు.  దాన్ని కుటిల రాజకీయాలు చేసేవారు తప్ప ఎవరూ తప్పుబట్టరు.  ఇంకా అలా చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జనసేన జనానికి అండగా ఉంటుందనే మంచి పేరు వచ్చుండేది.  ఇంకొన్ని రోజుల్లో ఎలాగూ ఈ సమస్య మరుగునపడిపోతుంది.  అప్పుడిక పవన్ నిరసన కాదు కదా నిరాహారదీక్షకు దిగినా అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం ఎందుకు అంటారు జనం.  ఒకవేళ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమల్లో, ప్రెస్ నోట్లలో ప్రశ్నించాం కదా అంటూ సమర్థించుకుంటే అది స్వామి భక్తే అవుతుంది తప్ప మరొకటి కాదు.