ఏదైనా సంస్థలో కార్మికులు సమ్మె, ఆందోళన చేస్తుంటే, కొన్నాళ్ల తరువాత యాజమాన్యం వారిని చర్చలకు పిలుస్తుంది. కార్మిక సంఘాల తరపున కనీసం పదిమందైనా ఆఫీస్ బేరర్స్ ఉంటారు. వారంతా కలిసి యాజమాన్యంతో చర్చల్లో పాల్గొంటారు. అలా కాకుండా ఒకరిద్దరే వెళ్లి చర్చలు జరుపుతామంటే దాన్ని కచ్చితంగా అనుమానించాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు ఒప్పుకోవడం, అగ్రిమెంట్స్ అయ్యాక యూనియన్ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని కార్మికుల్లో అసంతృప్త వర్గాల వారు ఆరోపణలు చేస్తారు. అయినప్పటికీ చేయగలిగేది ఏమీ ఉండదు.
పార్టీ పెట్టినప్పటినుంచి “నిర్జనసేన” గా అపఖ్యాతిపాలైన జనసేన అగ్రనేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఉన్నది వారి అధిష్టానం కాదు. అయినప్పటికీ బీజేపీ తమ అధిష్టానం అన్నట్లుగా ఆ ఇద్దరు నాయకులు వారిముందు చేతులు కట్టుకుని నిలుచుంటున్నారు. బీజేపీ అగ్రనేతల దర్శనభాగ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా వారిద్దరే వెళ్లడం ఏమిటి? ఇక ఆ పార్టీలో నాయకులే లేరా అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. “నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి” అన్నాడు కవి. ఎంతొకేళ మొనగాళ్లు ఎవ్వరూ లేరనుకున్నా కనీసం టీవీ చానెళ్లకు వెళ్లి గొంతులు చించుకుంటున్న అధికారప్రతినిధులు, సినిమా అభిమానంతోనో, కులాభిమానంతోనో, పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో సమర్ధిస్తూ ఆయనకు లేని లక్షణాలను ఆపాదిస్తూ స్వయంతృప్తిని పొందే వీరాభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురినైనా ఢిల్లీ తీసుకెళ్ళచ్చు కదా! ఇతరులతో వెళ్తే ఢిల్లీలో తమ గుట్టు బయటపడుతుందనే భయం అని వారి పార్టీలోని కొందరు ముసిముసిగా నవ్వుతూ చెప్పుకుంటుంటారు.
ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలవాల్సిన చారిత్రిక అవకాశాన్ని గుర్తించి ఆ సీటును బీజేపీకి త్యాగం చేసిన జనసేనుడు, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని గప్పాలు కొట్టి, తీరా నామినేషన్లు వేసే సమయానికి మళ్ళీ త్యాగమూర్తి అవతారం ఎత్తి, అలాగే తిరుపతి ఉప ఎన్నికలో మేము పోటీ చేస్తామని, అది మా అన్నయ్య చిరంజీవి గెలిచిన పవిత్ర పుణ్య స్థలమని బీరాలు పలికి, కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం రాగానే ఢిల్లీ వెళ్లి అక్కడ యజమానులతో “రహస్య ఒప్పందం” కుదుర్చుకున్నారు. పోనీ, అప్పుడైనా, బీజేపీ అగ్రనేతలతో కలిసి మీడియా ముందుకొచ్చి “తిరుపతి సీటును మా మిత్రపార్టీ కోసం త్యాగం చేస్తున్నామని” ప్రకటించారా? ఢిల్లీ నుంచి వచ్చాక కూడా తిరుపతిలో పోటీ చేస్తున్న బిల్డప్ ఇచ్చారు. మరో కామెడీ ఏమిటంటే, మాజీ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు అనేకమంది జనసేన టికెట్ మీద పోటీ చెయ్యడానికి తహతహలాడుతున్నారంటూ పచ్చ మీడియాలో వార్తలు కూడా వ్రాయించుకున్నారు పవన్ కళ్యాణ్.
తీరా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తిరుపతిలో తామే పోటీ చేస్తున్నామని, ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని, ఆ విషయాన్ని ఢిల్లీలో జాతీయాధ్యక్షుడు సముఖంలోనే పవన్ ఒప్పుకున్నారని ఒక బాంబ్ పేల్చారు. పవన్ కళ్యాణ్ గాలిని మరోసారి ఆ విధంగా తీసి అవతల పారేశారు వీర్రాజు. దీన్నిబట్టి చూస్తే బీజేపీ వారు పవన్ కళ్యాణ్ ను ఆటలో అరటిపండు మాదిరిగా, కూరలో కరివేపాకుగా, పులుసులో చింతపండుగా, పచ్చడిలో పీచుగా మాత్రమే పరిగణిస్తున్నారని మరోసారి తేలిపోయింది. “ఏ విధమైన పాకేజీ లేకుండా బీజేపీకి ఎందుకు ఏకపక్షంగా పవన్ మద్దతు ఇస్తున్నారని” కొందరు పవనాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పేరు చెప్పుకుని పాకేజీలకు లొంగిపోతున్నారని విమర్శిస్తున్నారు. ఎంత ఏడిస్తే ఏమిలాభం? జనసేన అనేది ఒక మృతశిశువు. అమృతం తెచ్చి పోసినా కదలిక రావడం అసంభవం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు