HomeTR Exclusiveకరుసైపోయిన కోటేశ్వరరావు 

కరుసైపోయిన కోటేశ్వరరావు 

ఎక్కడ?  ఎక్కడ?  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ?  నగర పాలక సంస్థకు జరుగుతున్నా ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎక్కడ?  ప్రచారహోరులో జాతీయాధ్యక్షుడు నడ్డా పక్కనో, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్కనో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సరసనో…ఏదోఒక మూలనైనా, ఎవరి సరసనైనా పవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్ కనిపిస్తారేమో అని ఆయన అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని గాలిస్తున్నా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు!  
Pawan Kalyan Hiding From Ghmc Elections
pawan kalyan hiding from ghmc elections
 
ఔరా…కేసీఆర్ నే తాట తీస్తా…తోలు వలుస్తా అని గర్జించిన పవన్ కళ్యాణ్….జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వను అని భీకర ప్రతిజ్ఞలు చేసిన పవన్ కళ్యాణ్….బీజేపీ తో పొత్తు కోసం ఎన్నికలపోటీని త్యాగం చేసిన గొప్ప బలిచక్రవర్తి…బీజేపీ రాజకీయతంత్రాలకు బలిపశువైపోయాడా అంటూ పవర్ స్టార్ అభ్హిమానులు కుళ్ళి కుళ్ళి విలపిస్తున్నారు.  తమ అభిమాన కథానాయకుడు….సింహంలా గడ్డం పెంచినా…సింహంలా కాకుండా, గడ్డం గీసుకున్నా, ఢిల్లీ వెళ్ళినపుడు ఒక్క నాయకుడిని కలవడానికి రెండురోజులు క్యూలో నించోబెట్టిన అవమాన భారాన్ని తట్టుకోలేక తలలు బాదుకుంటుంటే…తమ అభిమాన హీరో పరువు నిలబెట్టడానికైనా భాగ్యనగర వీధుల్లో ప్రచారం చేస్తున్నసమయంలో అయినా…”రా పవన్…మీరు ఒక్క పిలుపు ఇస్తే నగర మేయర్ కిరీటం మా నెత్తినే కూర్చుంటుంది అని ఒక్క బీజేపీ నాయకుడు కూడా పిలవలేదు అంటూ హృదయాలు బద్దలు చేసుకుంటున్నారు అభిమానులు. 
 
ఆంధ్రా ఓటర్లు తమ హీరోను దారుణంగా రెండుచోట్లా ఓడించి తిరుక్షవరం చేసి కూర్చోబెట్టినంత మాత్రాన అంత అలుసైపోవాలా బీజేపీ వారికి?  మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ వీధుల్లో రెండు రోజులు కాలుగాలిన పిల్లిలా తిరిగినప్పటికీ కనీసం అమిత్ షా అయినా పట్టించుకోకుండా తిరుగు టపాలో పంపించడం ఏమిటి?  ఇదేనా మిత్ర ధర్మం?  గెలిస్తేనేనా మనిషికి విలువ ఇచ్చేది?  ఇప్పటికీ మా పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ హీరో తెలుసా? అంటూ ఉక్రోషిస్తున్నారు ఆయన విసనకర్రలు!  మా పవన్ అంతటివాడిని ప్రచారానికి వాడుకోరా?  పవన్ చెబితే ఓట్లు వేసే సన్నాసులు ఎవరూ లేరని మీరు ఎలా నిర్ణయిస్తారు?  అంటూ వాపోతున్నారు.  
 
ఇక మా హీరో ఢిల్లీలో రెండు రోజులు పడిగాపులు కాసినా తిరుపతి టికెట్ మీదే అని ఒక్క నాయకుడు కూడా హామీ ఇవ్వకపోవడం పట్ల పీకే ఫాన్స్ మండిపడుతున్నారు.  తిరుపతి అంటే ఎన్నుకున్నారు?  సొంత ఊరిలో ఓడిపోయిన పవన్ అన్నయ్యను గెలిపించిన మహత్తరమైన ప్రదేశం అది. ఎప్పుడో పుష్కరం కింద జరిగిన ఆ పొరపాటు పునరావృతం అవుతుందనే భ్రమల్లో ఉన్న అభిమానుల ఆత్మలు ఘోషించేలా తిరుపతిలో మా పార్టీ పోటీ చేసిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రకటించడం మా హీరోను అవమానించడం కాదా అని అభిమానులు ఆక్రోశిస్తున్నారు.  మొత్తానికి ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ, హస్తినాపురిలోనూ తమ హీరోకు పరాభవభారాలే మిగిలాయని, ఇక తమ హీరోని ఏవిధంగా సమర్ధించుకుని రావాలంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  “ఏం ఫర్వాలేదు.  మా హీరోది పాతికేళ్ల రాజకీయం.  రెండువేల నలభై నాలుగులో అయినా మా హీరో అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం” అని మీసం మెలేసాడు ఒక జనసైనిక మిత్రుడు!  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News