కొత్త విద్యా విధానంలో మిత్ర పక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు గతంలో కేంద్ర మంత్రి సాక్షాత్తూ ప్రకటించడంతో కేంద్రంలోని మోడీ సర్కార్, ఎంతలా ప్రత్యేక గౌరవాన్ని మిత్ర పక్షం జనసేనకు ఇస్తోందో అందరికీ అర్థమయ్యింది. కానీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ జనసేనకు బీజేపీ అంతలా ప్రాధాన్యత ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా జనసేన అధినేత పవన్, ఢిల్లీకి వెళ్ళారు. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఆ వివరాల్ని పవన్ అండ్ టీమ్ చాలా గోప్యంగా వుంచుతున్నారు. ప్రధానితో భేటీ కోసం జనసేన ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీతోపాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
ఇలా పలువురితో పవన్ భేటీ అవుతారని జనసేన ఇప్పటికే ప్రకటించేసింది. వారిలో ఎంతమంది అపాయింట్‌మెంట్లు జనసేనానికి దక్కుతాయన్నది ఇంకా సస్పెన్సే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రానికి విజ్ఞాపన అందించనున్నారు జనసేన అధినేత. అయితే, అది ఆగబోదని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) సుజనా చౌదరి చెబుతున్నారు. అదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఏపీ బీజేపీ వ్యతిరేకిస్తోందని సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడమే కాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారమొక్కటే కాదు, రైల్వే జోన్ అంశం కూడా విశాఖ పరిధిలోనిదే. ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం.. వంటి అంశాలూ రాష్ట్రానికి సంబంధించి చాలా చాలా కీలకమైనవి. వీటిల్లో ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఇష్టం లేదు గనుక, ఆ అంశాన్ని జనసేనాని పక్కన పెట్టినా, మిగతా విషయాలపై కేంద్రంతో జనసేనాని చర్చించే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. వీటిల్లో కొన్ని అంశాలపైన అయినా జనసేన అధినేత తన ఢిల్లీ టూర్ సందర్భంగా స్పష్టత తీసుకొచ్చినా.. అది జనసేనకు పెద్ద విజయం అవుతుంది.. జనసేన – బీజేపీ మధ్య బంధం బలంగా వుందన్న విషయం స్పష్టమవుతుంది. మరి, ఆ దిశగా కేంద్రాన్ని జనసేనాని ఒప్పించగలరా.? అన్నది వేచి చూడాల్సిందే.