ఆయనకేమో ఆమె మీద మోజు. ఆమెకు మరొకాయన మీద మోజు. ఆ మరొకాయనకు ఇంకొకామె మీద మోజు… ఏమిటీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ అక్రమసంబంధాల మోజులు, ప్రేమలు తెగ కారిపోతున్నాయి. పాపం..జనసేనుడికి తెలుగుదేశం మీద మోజు. కానీ బీజేపీతో బలవంతపు బంధానికి కట్టుబడాల్సి వచ్చింది. బీజేపీకి తెలుగుదేశం మీద మోజు. కానీ, జనసేనుడికి ముడి వెయ్యాల్సివచ్చింది. తెలుగుదేశాధినేతకు మోడీ అంటే తెగ మోజు. ఎందుకంటే ఆయన పంచప్రాణాలు మోడీ చేతుల్లో ఉన్నాయి. కానీ అటునుంచి సిగ్నల్స్ రావడం లేదు.
ప్రస్తుతం మనం జనసేనుడి గూర్చి చెప్పుకుందాము. 2014 లో రాజకీయపార్టీని పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆదిలోనే హంసపాదు అన్నట్లు తొలి ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన లక్ష్యం ఎన్నికల్లో పోటీ చెయ్యడం కాదు…జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా నివారించడం. అందుకని ఆయన చంద్రబాబు పాదాల చెంత చేరాడు. నిజమో కాదో తెలియదు కానీ ఆయనకు పాకేజిరాయుడు అనే బిరుదు వచ్చింది. “మా దగ్గర ఆరువందలకోట్లు తీసుకుని మద్దతు ఇచ్చాడు” అని తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసినప్పటికీ జనసేనుడు ఖండించలేదు. చంద్రబాబుతో అంటకాగుతూ ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ప్రశ్నించకుండా, నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ప్రతి విషయాన్నీ తప్పు పట్టడం లాంటి అవివేక చర్యలకు పాల్పడి ప్రజాభిమానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. పైగా ఒక దుర్ముహూర్తంలో చంద్రబాబుతో తెంచుకుని “రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని ఆశపెడితే మద్దతు ఇచ్చాను…మేము ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నట్లయితే కనీసం పది సీట్లు వచ్చి ఉండేవి” అని తన అజ్ఞానాన్ని బహిర్గతం చేసుకుని నవ్వులపాలయ్యాడు.
మాటకు నిలకడ లేదు
అప్పటినుంచి కాస్తో కూస్తో యాక్టీవ్ గానే కనిపించినప్పటికీ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా సుమారు నూట నలభై సీట్లలో పోటీ చేసి నాలుగైదు మినహా అన్నిచోట్లా డిపాజిట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తైతే…తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో దారుణంగా పరాభవించబడం మరొక గమ్మత్తు. ముఖ్యమంత్రిని అయిపోతానని కన్న కలలు అన్నీ కల్లలుగా మిగిలిపోవడంతో తనకున్న అసలు బలమేమిటో తెలిసొచ్చింది. తనకు కులం లేదని, మతం లేదని చెప్పిన కాకమ్మ కథలను ఆయన దురభిమానులు నమ్మితే నమ్మి ఉండొచ్చు కానీ, కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నప్పుడే ఆయనలో అంతర్లీనంగా ఉన్న కులపిచ్చి బయటపడిపోయింది. రాజకీయ విశ్లేషకులు ఎన్నడూ పవన్ కళ్యాణ్ ను ఒక రాజకీయ శక్తిగా పరిగణించనే లేదు. పవన్ కళ్యాణ్ కు రెండు సీట్లు కూడా రావని నేను అనేకసార్లు మూడేళ్ళక్రితమే నా వ్యాసాల్లో నొక్కి చెప్పాను.
గాజు గ్లాస్ భళ్ళున పగిలింది
ఎన్నికల్లో ఓడిపోవడంతో జనసేనలో మిగిలున్న ఒకరిద్దరు పేరున్న నాయకులు జారిపోయారు. కాస్త చదువు సంస్కారం ఉన్న అద్దేపల్లి శ్రీధర్ ఎన్నికలకు ముందే జనసేనకు రాజీనామా చెయ్యగా, ఆ తరువాత వివి లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు జనసేనలో నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన నాయకుడు ఎవ్వరూ లేరు. తాను ఓడిపోవడం కన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం భరించలేకపోతున్నారు. కాపులు తనను నాయకుడుగా నెత్తిన పెట్టుకుంటారని ఆశలు పెట్టుకుంటే గతంలో చిరంజీవిని నమ్మి మోసపోయిన కాపులు పవన్ కళ్యాణ్ లాంటి విశ్వసనీయత, నైతికత లేని వ్యక్తితో జత కట్టి మరొకసారి మోసపోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. కాపుల ఆధిక్యత ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పార్టీ ఒక్కచోట మినహా మిగిలిన అన్ని సీట్లలో అవమానకరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దీన్ని బట్టి కాపులకు పవన్ మీద విశ్వాసం లేదని తేలిపోయింది. జగన్ ను ఒంటరిగా ఎదుర్కోవడం తనకు సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా అర్ధమైపోయింది. తాను నమ్ముకున్న చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడమే కాక జగన్ ప్రభుత్వం పెట్టె కేసులను ఎదుర్కోవడం తధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఒక అండ అవసరం అని నిశ్చయానికి వచ్చాడు.
ఏ దిక్కూ లేనపుడు అక్కమొగుడే దిక్కు
బీజేపీ తప్ప పవన్ కళ్యాణ్ కు మరొక గత్యంతరం లేదు. అందుకే బీజేపీతో దోస్తీకి తహతహలాడుతూ బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపినప్పటికీ మోడీ, అమిత్ శాలు అసలు పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం. నిన్నగాక మొన్న ప్రజలతో ఛీత్కరించబడిన పవన్ కళ్యాణ్ ను స్వాగతించడానికి మోడీ, శాలు అవివేకులా? గుప్పిట మూసిఉన్నంతకాలం పవన్ ఏదో పొడిచేస్తాడని నమ్మారు. గుప్పిట తెరిచిన తరువాత పవన్ బలం గాలిలేని ట్యూబ్ లా శూన్యం అని తేలిపోయింది. ఇక పవన్ తో దోస్తీకి ఎవరు ఆసక్తి చూపుతారు. నపుంసకుడైనా రంభనే కోరుకుంటాడు తప్ప కురూపిని కోరుకోడు కదా! చచ్చీచెడీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాళ్ళు గడ్డం పట్టుకుని మైత్రికి మామ అనిపించుకుని వచ్చాడు. ఆ తరువాత మర్యాదపూర్వకంగా అయినా మోడీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ ను కలవడానికి ఇష్టపడలేదు! కాపురం చేసే కళ మొదటిరోజే తెలిసిపోయింది. పేరుకు బీజేపీతో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మనసంతా తెలుగుదేశం మీదనే ఉన్నది అని విశ్లేషకుల అభిప్రాయం. రాబోయే ఎన్నికలనాటికి మళ్ళీ వారు కలిసే అవకాశాలను కొట్టేయ్యలేము.
కకావికలైన జనసైనికులు
బీజేపీని బండబూతులు తిట్టిన జనసైనికులు పవన్ వెర్రిచేష్టలతో దిగ్భ్రాంతికి గురైనారు. ఇప్పుడు పవన్ తో పాటు మోడీకి కూడా జై కొట్టాలి. ఆ ఊహనే భరించలేని చాలామంది కార్యకర్తలు జనసేనకు దూరం అయ్యారు. పవన్ పిలుపుకు స్పందనే కరువైంది. అమరావతి విషయంలో పవన్ వైఖరి చూసిన తరువాత పవన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడనే విషయం అందరికీ అర్ధమైపోయింది. పవన్ కళ్యాణ్ కు కావలసింది ఇప్పుడు డబ్బులు…ఆ డబ్బులకోసం సినిమాలు చెయ్యనని గప్పాలు కొట్టిన వ్యక్తి ప్రజలను గాలికి వదిలేసి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. జనం సంగతి మరచిపోయాడు.
అంతా స్వీయతప్పిదాలే
తొలి అడుగు నుంచి అన్నీ తప్పుల మీద తప్పులు చేస్తూ, ప్రత్యర్దులమీద నోరు పారేసుకుంటూ, విమర్శకులను తన అభిమానులతో అసభ్యంగా దూషణలు చేయిస్తూ, ప్రజలతో ఛీ కొట్టించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ డ్రామాకు తెరపడినట్లే అనడానికి సందేహం లేదు. పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఎవరైనా ఓట్లు వేస్తారు అని నమ్మితే వారిని గుడ్డివారికింద జమకట్టవచ్చు. మొత్తానికి సినిమాలో హీరో అయిన పవన్ రాజకీయాల్లో ఒక జోకర్ గా మిగిలి అభాసుపాలు కావడం స్వయంకృతాపరాధం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు