అమ్ముడు బోయి ప్రింట్ చేస్తున్నారా? ప్రింట్ చేసి అమ్ముతున్నారా?

 

ఎపిలో పాపులర్ మీడియా వ్యవహార సరళి గురించి పై సందేహం ఇటీవల సోషల్ మీడియాలే ఎక్కడో వారం రోజుల క్రితం చదివి నట్లు గుర్తు. ఎవరో ఆకతాయి ఈ ప్రశ్న లేవదీశారని భావించాను. కాని గత మూడు నాలుగు రోజులుగా ఎపిలోని మీడియా తీరు చూస్తుంటే అభిప్రాయం మార్చుకోక తప్ప లేదు.
మరీ ఇంత పచ్చిగా దిగ జారి పోయారా? అని విస్తు పోవలసి వచ్చింది. 

మూడు రోజుల క్రితం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ లోక్ సభలో ప్రవేశపెట్టింది.(ఎపికి తొలి నుండి అన్యాయం చేసింది.) ఈ బడ్జెట్ తీరు ఎన్నికల తాయిలాలుగా వుందని ప్రజలను భ్రమలో వుంచే విధంగా వుందని పాపులర్ మీడియా కథనాలు వండి వార్చింది. . ఎపికి ఈ బడ్జెట్ లో చిల్లి గవ్వంత కేటాయింపులు లేవని అభివర్ణించారు. వాస్తవంలో కేంద్ర ఎపి యెడల కక్ష పూరిత వైఖరి అవలంభించు తున్నందున ఇందులో తప్పేమి గోచరించ లేదు. వాస్తవమే కాబోలు అనుకోవలసి వచ్చింది.

తీరా మరు రోజు ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలు రెండు నెలల ముందు ఫించన్లు డబుల్ చేయడం పసుపు కుంకుమ పేరుతో చెక్కులు పంపిణీ చేసిన ఉత్సవాలను ఈ మీడియా సంక్షేమ సంబరాలుగా కొనియాడుతూ వింత వింత కథనాలు ప్రచురించాయి. మరీ కొన్ని టివి ఛానల్స్ అయితే గంటల కొద్దీ ఈ కార్యక్రమాలను ప్రసారం చేశాయి.

కేంద్ర బడ్జెట్లోని అంశాలను ఎన్నికల తాయిలాలుగా పేర్కొని కోడు గుడ్డుపై ఈకలు పీకిన ఈ మీడియా నాలుగేళ్ల కాలం కాలక్షేపం చేసి ఎన్నికల ముంగిట డబ్బులు కాకుండా చెక్కులు ఇవ్వడం ఫించన్లు డబుల్ చేయడం నాలుగు ఏళ్లు మిన్న కుండి రెండు నెలల క్రితం వేయి నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రస్తుతం డబుల్ చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కుగా పాపులర్ మీడియా తట్ట లేదంటే ఆశ్చర్య పోవలసినది – ఏమీ లేదు.

ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ ఆగంతకుడు ఎవరోఏమో గాని అతను పెట్టిన పోస్టు గుర్తు కొచ్చింది. ఇందులోని పరమార్థం అవగత మైనది. ఈ నాలుగేళ్ల కాలంలో తుమ్మినా దగ్గినా ప్రజా ధనాన్ని కోట్లాది రూపాయలు ప్రకటనల రూపంలో ముఖ్యమంత్రి ఈ మీడియాకు ముట్ట జెపు తున్నందున ఈ ఆపద మొక్కులు ఎన్నికల తాయిలాలుగా వీరికి తట్టక పోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఈ పాపులర్ మీడియా ప్రింట్ కాకముందే అమ్ముడు పోవడంతో కేంద్ర బడ్జెట్ ఎన్నికల తాయిలాలుగా కనిపించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కులు తాయిలాలుగా కనిపించలేదు.

ఈ నాలుగేళ్లుగా ఈ మీడియా తీరు గుర్తు చేసుకుంటే మరో ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. . 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత యుపి లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో ప్రధాని మోదీ తో పాటు అమిత్ షా ఎత్తు గడలు వ్యూహాల అమలు గురించి ఈ మీడియానే జుగుప్స కలిగే విధంగా పొగుడుతూ వార్తలు కథనాలు ప్రచురించాయి. పాపం రాహుల్ గాంధీని పురుగు లాగా అభివర్ణించాయి. తీరా తాము అమ్ముడు బోయిన బాస్ యు టర్న్ తీసుకోగానే నేడు ప్లేట్ ఫిరాయించాయి. కేంద్రంఎపికి అన్యాయం చేసింది – కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరిచారని భావించి సర్దు కున్నా ప్రస్తుతం మరో అంకానికి తెర దీశారు. పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకతతో జీవం పోసుకున్న ఒక మీడియాతో పాటు ఎపిలోని ఈ పాపులర్ మీడియా రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని ప్రియాంక గాంధీని మరణించిన ఇందిరా గాంధీ తిరిగి అవతరించినట్టు కథనాలు ప్రచురించడమే కొస మెరుపు.

ఇదంతా ఎందుకు చెప్ప వలసి వచ్చిందంటే ఈ మీడియా పొద్దు తిరుగుడు పూవు లాంటిదని తమ బాస్ కాపురం అంటే ఆనందంతో నిండిన కాపురమని తిరిగి దానినే బాస్ వ్యభిచారమంటే పచ్చి వ్యభిచారమని అభివర్ణించడం చూస్తున్నాము.ఇంత లాలూచీ కూడా ప్రజా ధనం కోట్లాది రూపాయలు ప్రకటనల ద్వారా దోచుకోవడమనే.

ప్రజాస్వామ్యమనే మేలి ముసుగులో అటు నేతలు ఇటు మీడియా ఆడే దొంగాటలో భాగంగా ఇదంతా సాగుతోంది. ఆ మాటకు వస్తే బూర్జువా సమాజంలో ప్రచార సాధనాలు పెట్టు బడి దారి వర్గం చేతుల్లో వుంటే బూర్జువా పార్టీనేతల ప్రయోజనాలను కాపాడేందుకు అహర్నిశలు పని చేస్తుంటాయి. ఒక్కో సమయంలో ఈ దోపిడీ వర్గాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో ఘర్షణకు దిగి నపుడు మీడియా కూడా యూ టర్న్ తీసుకోవడం సహజమే. అదే ప్రస్తుతం ఎపిలో తటస్థించింది. ఒకప్పుడు అమిత్ షా అపర చాణుక్యుడని కీర్తించిన ఎపిలోని పాపులర్ మీడియా నేడు ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చు తున్నారు. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే రకంగా వ్యవహరించినా కేంద్ర బడ్జెట్ ఎన్నికల తాయిలాలైతే ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలు సంబరాలుగా ఈ మీడియా చెబుతోంది. అసలు కిటుకు ఏమంటే ప్రచార సాధనాలు పెట్టు బడి దారీ వర్గంలేదా వారి తాబేదారుల చేతులలో వుండటమే. ఫలితంగా సోషల్ మీడియాలో ఎవరో మిత్రుడు వ్యాఖ్యానించినటు పాపులర్ మీడియా ప్రింట్ కాకముందే అమ్ముడు పోయింది. 

అయితే సమాజం ప్రకృతి ఎపుడు సహజ శీలమైనవి. గుప్పెడు గింజలు నేల లో వేస్తే బస్తా గింజలు పండుతాయి. అందులో భాగంగానే అమ్ముడు పోతున్న మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఇది సర్వ సత్తాక స్వ తంత్రం కలిగి వుంది కాబట్టి ఈ వాస్తవికత విమర్శలకు చోటు లభిస్తోంది.

(వి. శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు, ఫోన్: 9848394013 )