చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె వివాహం జైపూర్ లో జరుగుతున్నది…సంతోషమే. వారింట్లో శుభకార్యం వారిష్టమొచ్చిన చోట చేసుకుంటారు. కానీ మన పత్రికలు వారి ఇంట్లో జరిగే పెళ్లిగురించి రాస్తున్న భజనరాతలు చూస్తుంటే ఒళ్ళు కంపరం పుడుతుంది. పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. వారి ఇంటికి, ఆహ్వానితులైన బంధుమిత్రులకు పరిమితం. ఆ పెళ్ళికి రమ్మని ఈ భజన రాయుళ్లలో ఒక్కరినైనా పిలిచారా మెగా కుటుంబం? ఎక్కడో ఎవరికీ అందనంత దూరంలో వాళ్ళు కార్యం చేసుకుంటుంటే ఈ పత్రికలవారి స్తోత్రాలు ఏమిటి?
ఒక ఛానెల్ ప్రసారం చేసిన ప్రోగ్రాం చూస్తే వాంతి వచ్చినంత పనవుతుంది. “మెగా డాటర్ పెళ్ళికి అందరూ ప్రత్యేక విమానాల్లో బయలుదేరారు. ఆరుగురు చొప్పున ఒక్కొక్క విమానంలో వెళ్లారు. విమానంలో చైతన్య, నీహారిక సరసాలు ఆదుకున్నారు. పెళ్లికూతురుకు మంగళ స్నానం చేయించారు…పట్టు చీర కట్టారు…గాజులు తొడిగారు…ఇవన్నీ నాగబాబు వీడియో తీసి పంచుకున్నారు…సంగీత్ ఆడారు. చిరంజీవి, సురేఖ, నాగబాబు, అల్లు అర్జున్, అరవింద్ డాన్సులు చేశారు…అతిధులకు అరిటాకులో భోజనాలు పెట్టారు…నాగబాబు స్వయంగా వడ్డించారు…పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…” ఇలా సాగిపోయింది ఆ స్తోత్రం. ఇందులో విశేషం ఏముంది? ఇలాంటివి ప్రస్తుతం మధ్యతరగతి వారింట్లో కూడా జరుగుతున్నాయి. మధ్యతరగతి వారిళ్లలో కూడా సంగీత్ లు, డాన్సులు, గుర్రాలు ఎక్కడాలు, అన్ని విన్యాసాలు వేడుకలు జరుగుతున్నాయి. ఇక చిరంజీవి ఇంట్లో జరగడంలో వింత ఏముంది?
ఇక మరొక పత్రిక అయితే మెగా డాటర్ కు అయిదు కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి అంటూ అదేదో గొప్ప విశేషంగా రాసుకుంటూ పోయింది. చిరంజీవి ఎంతిచ్చాడు అనే విషయం మాత్రం వారికి తెలియదు పాపం! వాళ్ళు అంతిచ్చారు..వీళ్ళు ఇంతిచ్చారు అంటూ సోది…శుభకార్యాల్లో ఎవరి తాహతుకు తగిన బహుమతులు వారిస్తారు. ఒక్కో సినిమాకు ఇరవై నుంచి యాభై కోట్లు పుచ్చుకునే స్టార్లు అయిదారుగురున్నారు వారి కుటుంబంలో. వారు అందరూ కలిసి పెళ్లికూతురుకు అయిదు కోట్లు ఇవ్వడం అనేది వారి స్తోమతుకు సముద్రంలో కాకి రెట్ట లాంటిది. ఒక్కొక్కరు ఒక్క సినిమా పారితోషికం వదులుకున్నా కనీసం వందకోట్లు ఆమెకు బహుమతిగా ఇవ్వచ్చు. ఒక ఉన్నతోద్యోగం చేసి, లంచావతారాలైన వారే తమ పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తులను కానుకలుగా ఇస్తున్నారు. చంద్రబాబు గారు తన రెండేళ్ల మనుమడికి పదకొండు కోట్ల రూపాయల విలువైన కానుకలు ఇచ్చారు. రాజకీయరంగంలో, సినిమారంగంలో, వ్యాపారరంగంలో …ఎక్కడ బ్లాక్ మనీ పోగేసుకోవచ్చో అలాంటి అన్ని రంగాల్లోనూ తమ సన్నిహితులకు భారీ బహుమతులు ఇవ్వడం అతి సాధారణం. ఇక మెగా ఫ్యామిలీ వారు తమ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి అయిదు కోట్లు ఇవ్వడంలో ఏమి విచిత్రం ఉన్నదో రాసేవారికే తెలియాలి..
ఈ మెగాఫ్యామిలీ కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ కలిగిన అభిమానులు లక్షలమంది ఉన్నారు. వారిలో పదిమందిని ఆహ్వానించి ఒక ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళినట్లయితే మెగా ఫ్యామిలీ వారి ఔదార్యానికి జోహార్లు అర్పించవచ్చు. మరి అలాంటి మహత్కార్యం ఏమైనా చేశారా వారు? పోనీ కోవిద్ బాధితులకు మందులు కొనుక్కోమని ఏమైనా ఉదారంగా దానం చేశారా? వారి పెళ్లి వారు చేసుకుంటే అదేదో లోకోద్ధరణ అయినట్లు మన భజన మీడియా బట్టలు చించుకోవడం చూస్తుంటే నవ్వొస్తుంది.
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని సామెతేదో గుర్తుకొస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్!