పేపర్ లీక్: బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు కేటీయార్ లీగల్ నోటీసులు.!

ఇదెక్కడి పంచాయితీ.? రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అంతమాత్రాన లీగల్ నోటీసులు ఇచ్చేస్తారా.? తెలంగాణ మంత్రి కేటీయార్ ఈ విషయంలో ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీయార్.

తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తున్న టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి మంత్రి కేటీయార్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వెనుక కుట్ర దాగి వుందనీ, ఆ కుట్ర కేటీయార్ కనుసన్నల్లోనే జరిగిందనీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి, రేవంత్ అలాగే బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు చూపించాలంటూ ఇప్పటికే ‘సిట్’ నోటీసులు జారీ చేసింది, రేవంత్ విచారణకు కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని తెలంగాణ సిట్ పేర్కొంది. మరోపక్క, మంత్రి కేటీయార్.. తన మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై మండిపడుతూ, లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీయార్.

కాగా, విద్యార్థులు ఈ రాజకీయ విమర్శల్ని పట్టించుకోవద్దనీ, పేపర్ లీక్ విషయంలో విచారణ జరుగుతోందనీ, అభ్యర్థులకు నస్టం కలగనివ్వబోమని మంత్రి కేటీయార్ చెబుతున్నారు.