Neeraj Chopra: ఒలింపిక్ హీరోకు గౌరవ సైనిక హోదా

భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి ఆటపాటల కోసం కాదు. దేశానికి సేవ చేసినందుకే, ఆయనకు భారత ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఏప్రిల్ 16 నుంచి ఈ హోదా అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు మరింత ప్రతిష్ఠ చేకూరింది.

టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్ ప్రకారం, ఈ గౌరవాన్ని రాష్ట్రపతి ఆమోదంతో మంజూరు చేశారు. హర్యానాలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామానికి చెందిన నీరజ్ ఇప్పటికే 2016లో సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా చేరారు. తరువాతే ఆటలో విజయాలు అందుకుంటూ, దేశాన్ని గర్వపడేలా చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఓ పుట వేశారు.

ఇంతకుముందూ మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్ వంటి క్రీడా మహానుభావులు కూడా ఈ గౌరవాలను అందుకున్నారు. వారితో పాటు ఇప్పుడు నీరజ్ కూడా ఈ ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణం. అభినవ్ బింద్రా, బీజింగ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవించబడ్డారు. అలాగే సచిన్‌కు IAFలో గ్రూప్ కెప్టెన్ హోదా లభించింది.

నీరజ్ ప్రస్థానంలో 2018లో అర్జున అవార్డు, విశిష్ట సేవా పతకం, 2021లో స్వర్ణం అనంతరం పదోన్నతులతో మరింత ముందుకు వెళ్లాడు. ఇప్పుడు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలవడం ఆయన సేవలకు అంకితభావానికి నిదర్శనం. ఈ క్రీడా యోధుడికి దేశం సెల్యూట్ చేస్తోంది.