OG Movie Review: ‘ఓజీ’ -మూవీ రివ్యూ! పవన్ ఎలివేషన్స్- స్టోరీ ఎలిమినేషన్!

రచన- దర్శకత్వం : సుజీత్
తారాగణం: పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, తేజ్ సప్రూ, శుభలేఖ సుధాకర్, అభిమన్యూ సింగ్, అజయ్ ఘోష్ తదితరులు.
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, కూర్పు: నవీన్ నూలి
బ్యానర్: డి వి వి ఎంటర్ టైన్మెంట్
నిర్మాత : డి వి వి దానయ్య
విడుదల ; సెప్టెంబర్ 25 20 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం చాలాకాలంగా ఓపికపట్టి ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి నేటితో నిరీక్షణ తీరింది. రెండేళ్ళు నిర్మాణంలో వుండిపోయి విడుదల తేదీలు మారుతూ ఆఖరికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైతే వస్తున్న రెస్పాన్స్ ఆశాజనకంగానే వుంది. దర్శకుడు సుజీత్ ప్రాణమంతా పెట్టి ఈ బిగ్ బడ్జెట్ మూవీ తీశాడు. డివివి దానయ్య నిర్మాత. పవన్ కళ్యాణ్ తో సాధారణంగా డార్క్ మూవీస్ తీయరు. పూర్వం ‘పంజా’ మాత్రం తీశారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. రెండోసారి ‘ఓజీ’ డార్క్ మూవీయే. ఈసారి ఎలా తీశారు? పవన్ తో సుజీత్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా చూద్దాం…

కథేమిటి?

ఈ కథ 1940 లలో జపాన్ లో ప్రారంభమవుతుంది. అక్కడ సమురాయ్ గ్యాంగ్స్ అంతర్గత పోరాటాలతో అంతమైపోతారు. ఒక్కడే మిగులుతాడు, అతను ఓజీ – ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్). ఇతను తప్పించుకుని సత్యదాదా (ప్రకాష్ రాజ్) తో బాటు షిప్పులో ముంబాయి వచ్చేస్తాడు. ఇక్కడ్నుంచి 1970 లలోకి వెళ్తుంది కథ. ఇప్పుడు సత్యదాదా పోర్టు నిర్వహిస్తూ ఉంటాడు. ఓజీ అతడికి రక్షకుడుగా ఉంటాడు. అయితే సత్య దాదాతో తేడా వచ్చి కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణి (ప్రియాంకా మోహన్) ని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటి ల వుతాడు. ఇటు సత్యదాదా గీతా (శ్రియా రెడ్డి)తో కలిసి మీరాజ్కర్ (తేజ్ సప్రూ) నీ అతడి కుటుంబాన్నీ అంతమొందిస్తాడు. పోర్టుకి రహస్యంగా వస్తున్న ఒక కార్గో కంటెయినర్ ని మీరాజ్కర్ హస్తగతం చేసుకోకుండా ఈ పనిచేస్తాడు సత్యదాదా. కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు ముంబాయికీ సత్య దాదాకీ పెద్ద ప్రమాదం వచ్చి పడుతుంది. పోర్టుకి భారీగా వస్తున్న ఆర్డీఎక్స్ తో ముంబాయికి ప్రమాదం తలపెట్టే పథకంతో ఉంటాడు ఓమీ (ఇమ్రాన్ హాష్మీ) అనే గ్యాంగ్ స్టర్. దీంతో 15 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉంటున్న ఓజస్ తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు ఓజస్ ఓమీని ఎదుర్కొని సత్యదాదానీ, ముంబాయినీ ఎలా కాపాడాడనేది మిగతా కథ.

ఎలావుందికత

‘సాహో’ ఫేమ్ దర్శకుడు సుజీత్ ‘సాహో’తో కలిపి ‘ఓజీ’ ని తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీశాడు. దీనికి సెకండాఫ్ లో ‘సాహో’తో కనెక్షన్ ఇచ్చాడు. 2002 లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘రోడ్ టు పెర్డిషన్’ ఆధారంగా ఇదివరకే పవన్ కళ్యాణ్ తో వేరే దర్శకులు ‘బాలు’, ‘పంజా’ తీశాక, ఇప్పుడు అదే రూటులో మూడవ ఎడిషన్ అన్నట్టు ‘ఓజీ’ తీశాడు సుజీత్. ఇది పవన్ ని అత్యంత స్టయిలిష్ యాక్షన్ ఎలివేషన్స్ తో ప్రెజెంట్ చేసిన స్టోరీ. ఫస్టాఫ్ లో ఈ ఎలివేషన్స్ ‘కేజీఎఫ్’ ని గుర్తుకు తెచ్చినా అది మర్చిపోయేంత బలంగా సీక్వెన్సులు తీర్చిదిద్దాడు సుజీత్. పవన్ ని ఇదివరకు ఏ సినిమాలోనూ చూడని మాస్ బిల్దప్పులతో నింపేసి ఫస్టాఫ్ నడిపాడు. పవన్ ఎంట్రీ ఆలస్యమైనా, వచ్చాక ఆ లోటు తెలియకుండా క్యారక్టర్ ని డ్రైవ్ చేశాడు. ఫస్టాఫ్ ఓపెనింగ్ సీను, తర్వాత ఇంటర్వెల్లో వచ్చే సీనూ అత్త్యంత థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో హోరెత్తించి వదిలాడు. ఇదంతా సెకండాఫ్ లో స్టోరీకి సెటప్ మాత్రమే. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చాక- సెకండాఫ్ పోలీస్ స్టేషన్ సీను తో మరో పవర్ఫుల్ బ్యాంగ్ ఇచ్చాడు. పవన్- అభిమన్యూ సింగ్ లతో ఈ సీను సినిమాలో ఏకైక హైలైట్ అయిన సీనుగా నిలబడుతుంది.

కానీ….కానీ… దీని తర్వాతే సెకండాఫ్ గాలి తీసేసిన బెలూన్ లా మారిపోతుంది. ఫస్టాఫ్ లో సెటప్ చేసిన బలమైన ఎలివేషన్స్ కి పేఆఫ్ గా సెకండాఫ్ కథలేక తేలిపోతుంది. ఇలా సెకండాఫ్ లో చాలా సినిమాలకి ఇదే పరిస్థితి. ఫస్టాఫ్ లో ముంబాయి అండర్ వరల్డ్ ప్రపంచం, దాని గ్యాంగ్ స్టర్ గా ఓమి పరిచయం, వీటితో ఏర్పడ్డ సస్పెన్స్- టెంపో వగైరా సెకండాఫ్ లో బలహీనపడి, లేని కథకి మళ్ళీ ఎలివేషన్స్ జోడించి కాపాడుకోవాలనుకున్న ప్రయత్నం సక్సెస్ కాలేదు. కథతో మణిరత్నం తాజాగా తీసిన గ్యాంగ్ స్టర్ మూవీ ‘థగ్’ లైఫ్ పరిస్థితే దీనిదీ. ఫ్యాన్స్ ని మెప్పించే పవన్ క్యారక్టర్ ప్రెజెంటేషన్ ఒక్కటే సెకండాఫ్ లో కనపడే విషయం.

పైగా సెకండాఫ్ లో ఎన్నెన్నో పాత్రలతో సబ్ ప్లాట్స్ వచ్చేస్తాయి. ప్రధాన కథ బలంగా లేదని ఈ సబ్ ప్లాట్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేసినట్టుంది. ఇది తికమకకీ,గందరగోళానికీ దారితీసింది. దర్శకుడు ‘సాహో’ లో లెక్కకు మించిన విలన్స్ తో కన్ఫ్యూజ్ చేసిన విషయం మర్చిపోయినట్టుంది. ప్రభాస్ తో తీసిన సాహో’ అట్టర్ ఫ్లాపయ్యింది.

హింస, రక్తపాతం, అరాచకం సినిమా ప్రారంభం నుంచీ కంటిన్యూ అవుతూంటాయి. అయితే కథమీద దృష్టి పెట్టక పోవడంతో ఎమోషన్స్ అనేవి లేకుండా పోయాయి. ఎమోషన్స్ ముంబాయి సేఫ్టీతో ముడిపడి పవన్- ప్రకాష్ రాజ్- ఇమ్రాన్ హాష్మీ పాత్రలతో ముక్కోణపు యాక్షన్ డ్రామా సృష్టించాల్సి వుండగా- ఇది లేని డ్రై యాక్షన్ సీన్స్ తో నడిపితే ప్రయోజనమేమిటి? మొత్తానికి ఎలాగో క్లయిమాక్స్ కి చేర్చి బిగ్ యాక్షన్ ఎపిసోడ్ కి తెరతీసి ముగించారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ కి పండగ. మంచిదే, కనీసం ‘హరిహర వీరమల్లు’ లాగా కాకుండా.

ఎవరెలా చేశారు?
చెప్పనవసరం లేకుండా ఇది పవన్ హవాతో పవన్ ఒన్ మ్యాన్ యాక్షన్ షో. కాకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు. పవన్ నుంచి ఆశించే అయన మార్కు కమర్షియల్ అంశాలు లేవు. ఆసాంతం సీరియస్ పాత్ర, హింస. దీనికే పెద్దలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్. హీరోయిన్ ప్రియాంకా మోహన్ తో సరైనా రోమాన్స్ కూడా లేకపోవడం ఒక వెలితి. ఫ్యామిలీస్ అప్పీల్ కి, మాస్ అప్పీల్ కీ కేవలం ఒకే సీరియస్ మూడ్ లో యాక్షన్ సీన్స్. పవన్ ని ప్రెజెంట్ చేస్తూ పోయిన తీరు మాత్రం కొత్తదనంతో వుంది.

హీరోయిన్ ప్రియాంకా మోహన్ స్వల్ప పాత్రలో చేయడానికేమీ లేదు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హాష్మీ విషయమున్న పాత్రల్లో బలంగా నటించారుగానీ, కథలేకపోతే బలమైన నటనలు కూడా మెప్పించవు. ఇతర పాత్రల్లో మిగతా నటులు సబ్ ప్లాట్స్ తో గందరగోళమే సృష్టించారు. సాంకేతికాల విషయానికొస్తే ప్రొడక్షన్ విలువలు టాప్ రేంజిలో వున్నాయి. తమన్ సంగీతం పవన్ ఎలివేషన్స్ కి ప్లస్ అయింది. యాక్షన్ కొరియో గ్రఫీ,  ఎడిటింగ్ ఉన్నతస్థాయిలో వున్నాయి. రవిచంద్రన్, మనోజ్ పరమహంస ల సినిమాటోగ్రఫీ మరో ఎట్రాక్షన్. సుజీత్ రాసిన డైలాగులు ఓకే. స్క్రీన్ ప్లే మాత్రం ఫస్టాఫ్ స్టోరీ సెటప్ వరకూ పవర్ఫుల్, సెకండాఫ్ స్టోరీతో పరమ వీక్.

మొత్తానికి ఫస్టాఫ్ అందర్నీ మెప్పిస్తూ, సెకండాఫ్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో కమర్షియల్ సక్సెస్ అనడంలో సందేహం లేదు- మరీ ‘హరిహర వీరమల్లు’ లా కాకుండా!

రేటింగ్ : 2. 75/5

Public Reaction After Watching OG | First Day First Show | Telugu Rajyam