లక్ష్మణ్ రుడావత్
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్
ప్రైవేటు నర్సుల జీవితాలతో తెలంగాణ సర్కారు ఆటలాడుతున్నది. కనీస వేతనాలకు నోచుకోని నర్సులు చాలీ చాలని జీవితాలను నెట్టుకొస్తున్నారు. కేంద్రం ఆదేశించినా తెలంగాణలో ఉత్తర్వులు అమలు కావడంలేదు. తమిళనాడు, కేరళలో అమలవుతున్నాయి. ప్రభుత్వంపై నయాపైసా భారం పడదని తెలిసినా ప్రైవేటు నర్సులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి చేస్తున్న తాత్సారం నర్సుల పాలిట శాపంగా మారింది. కనీస వేతనాలకు నోచుకోకుండా బ్రతుకీడుస్తున్న ప్రైవేటు నర్సులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు.
అన్ని విషయాల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు నర్సులను ఆదుకునే విషయంలో మాత్రం వెనుకబడింది. దీనితో నైపుణ్యంతో కూడిన పనిని చేసే తమకు కనీస వేతనాలు ఇవ్వాలని దశాబ్దాలుగా పోరాడుతూ సుప్రీంకోర్టు తలుపులు తట్టి తమ వేతనాల విషయంలో స్పష్టతను తెచ్చుకున్నప్పటీకీ ఆ వేతనాలను తీసుకోలేకపోతున్నారు. ఈ విషయంపై కేంద్రం ఆదేశాలు జారీచేసి.. తీసుకున్న చర్యలపై నెల రోజుల్లో సమాచారం ఇవ్వాలని కోరి సంవత్సరంన్నర గడుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఇదే విషయంపై ప్రశ్నిస్తే సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పరిశీలించి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని సమాధానం ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అమలు చేస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన, ఢిల్లీ ప్రభుత్వ మంత్రిమండలి ఆమోదం తెలిపిన ఈ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలోని ప్రైవేటు నర్సులు ప్రారంభ వేతనం రూ.20 వేలు పొందగలుగుతారు. రాష్ట్రంలో వేలాదిగా విస్తరించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్, కాలేజ్‌లలోనూ వేలాది మంది బోధనా సిబ్బంది ఉన్నారు. వీరికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రంలోని వివిధ నర్సింగ్ సంఘాలు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లి మానవతా ధృక్పథంతో నిర్ణయాన్ని వేగంగా తీసుకోవాలని కోరాయి. అయినా పరిశీలన దశ దాటి అమలు దశకు రాకపోవడంతో ప్రైవేటు నర్సులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనాల అమలు విషయంపై కొంత మంది ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేశాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి సానుకూల నిర్ణయం రాకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కు ప్రైవేటు ఆసుపత్రుల్లో నర్సులకు కేంద్రం ఆదేశాల మేరకు కనీస వేతనాలను అమల్లోకి తీసుకురాకుండా కాలయాపన చేస్తుండడం వెనుక ప్రైవేటు ఆసుపత్రులతో కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఈ ఆదేశాలు అమలైతే పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు కనీస వేతనాలు చెల్లించాలి. చాలా ఆసుపత్రుల్లో ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు అరకొరగా ఉంటుండగా ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం లాభాలు గడిస్తూ శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ సూచించిన వేతనాలు చెల్లించగలిగిన ఆర్థిక పరిపుష్టి ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయించాల్సిన ప్రభుత్వం.. నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు నర్సులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు, కనీస వేతనాల అమలు తదితర డిమాండ్లను వినిపిస్తున్న నర్సింగ్ సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమౌతున్నాయి.
(పై వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత లక్ష్మణ్ రుడావత్ వ్యక్తిగతమైనవి.)