ఎన్టీఆర్ విగ్రహాల కూల్చివేత.. అహమా.. అవసరమా ?

తెలుగు రాజకీయాల్లో, తెలుగు జాతి చరిత్రలో స్మరించుకోదగిన వ్యక్తుల జాబితాల్లో దివంగత నందమూరి తారకరామారావుగారి పేరు ముందు వరుసలో ఉంటుంది.  తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ అనే మహా వృక్షాన్ని పెకలించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తిగా తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.  ఇక సంక్షేమ పథకాలతో బీద ప్రజలను ఎన్టీఆర్ ఆదరించిన తీరు ఎవరికైనా మార్గదర్శకమే.  అలాంటి మహోన్నత వ్యక్తిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి.  రాజకీయ నాయకులు సైతం రామారావుగారిని పార్టీలకు అతీతంగా స్పూర్తిగా తీసుకోవాలి.  అస్తమానం ఆయన్ను పొగడకపోయినా అవమానించడం తగదు.  
 
 
కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే.  రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తున్నారు.  ఇది ఆయన్ను అవమానించడం కాకపోతే మరేమిటి.  కొన్ని రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు.  గతంలో పంచాయితీ తీర్మానంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  కానీ తాజాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు విగ్రహం సచివాలయం భవనం కట్టడానికి అడ్డుగా ఉందని తొలగించి పక్కన పడేశారు.  గ్రామంలో ఎంతో చోటున్నా విగ్రహం ఉన్న చోటులోనే భవనం కట్టాలని వైసీపీ నేతలు పట్టుబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం ఉద్దేశ్యపూర్వక చర్య కాకపోతే మరేమిటి.  పైగా తొలగించిన విగ్రహాన్ని జాగ్రత్త చేశారా అంటే అదీ లేదు.. అవమానకర రీతిలో పక్కన పడేశారు. 
 
 
కొన్ని నెలల క్రితం విశాఖ మధురవాడ మార్కెట్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం మాయమైంది.  ఇప్పటికీ ఆ విగ్రహం ఏమైందో ఆచూకీ లేదు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరులోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు పెకలించారు.  స్థానికులు అడిగితే గుడికి అడ్డంగా ఉందని కారణం చెప్పారు.  ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  జిల్లా టీడీపీ నేతలు ఈ విషయమై గరంగరంగా ఉన్నారు.  స్వయంగా నందమూరి బాలకృష్ణ జిల్లా నేతలకు ఫోన్ చేసి సమగ్ర విచారణ చేయాలని తెలిపారు.  కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వరుసగా ఎన్టీఆర్ విగ్రహాల మీద ఏదో రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.  కొన్ని చోట్ల వైసీపీ నాయకులే దగ్గరుండి విగ్రహాలను తొలగిస్తున్నారు.  
 
 
ఈ చర్యలతో అధికార పార్టీ మీద జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళుతున్నాయి.  ఇన్నాళ్ళు అడ్డుకాని విగ్రహాలు ఇప్పుడే అడ్డవడం చిత్రంగానే ఉంది.  ఒకవేళ నిజంగానే అడ్డు అనిపిస్తే మహానేత అనే గౌరవం ఉంచి ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు.  నాయకులు, అధికారులు అనుకుంటే అదేం పెద్ద కష్టం కాదు.  కానీ అధికార పార్టీ వ్యక్తులు మాత్రం అధికారుల సాయంతో తొలగించేస్తున్నారు. జనం సైతం ఇలా విగ్రహాలు కూలిస్తే ఏమోస్తుంది.  కాలం చేసిన మహా నేతలను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోవాల్సింది పోయి ఈ కక్షపూరిత చర్యలెందుకు అంటున్నారు.  ఇప్పుడు వాళ్లు తొలగిస్తే రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తుంది.  తర్వాత తర్వాత అదే సంప్రదాయంగా మారిపోతుంది అంటున్నారు.  
 
 
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమకు చెందిన ముఖ్య నేతల విగ్రహాలను ఏర్పాటు చేయడం మామూలే.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాన కూడళ్లలో, ప్రముఖ ప్రాంతాల్లో, గ్రామాల్లో, వాడ వాడల్లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎన్నో వెలిశాయి.  చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహం పక్కనే వైఎస్సార్ విగ్రహం ఉంటుంది.  మొదటి నుండి కాలం చేసిన నేతలను, ప్రముఖులను విగ్రహాలను ఏర్పాటుచేసి గౌరవించుకోవడం మనకు అలావాటే.  అలా చేయడం మూలాన భావితరాలకు ఆ గొప్ప వ్యక్తులను గుర్తుచేసినట్టు ఉంటుంది.  ఇప్పటికే జాతి సంపద అయిన మహా నేతలను ఒక కులానికి, మతానికి అంటగట్టి, వారి బొమ్మలతో రాజకీయ లబ్ది పొందే పాడు సంస్కృతి దాపురించి ఉంది.  దానికి తోడు ఆ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తూ అహాలను చల్లార్చుకోవడం అనే కొత్త విష సంస్కృతి కూడా ప్రభలితే ఆ మహానుభావులకు అంతకు మించిన అవమానం ఉండదు.  అలా వారిని అవమానించే బదులు అసలు వారి విగ్రహలే పెట్టకపోవడం ఉత్తమం.